Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు..

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు..

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరం పెట్టేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు.  సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆమె ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాను నియంత్రించడం, అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి అనిత వివరించారు. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైందని, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కమిటీ సమీక్షించిందని, రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేసే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు.

విద్వేషపూరిత, అసభ్యకరమైన పోస్టులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పోస్టులకు సంబంధించి 1,384 కేసులు నమోదు చేసి, 1,067 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఆమె సభకు తెలియజేశారు.గతంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ‘వయసుకు తగిన సోషల్ మీడియా వాడకం’ కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను అధ్యయనం చేస్తామని ప్రకటించారు.

ఈ అంశాన్ని టీడీపీ జాతీయ స్థాయిలోనూ ప్రస్తావించింది. ఫిబ్రవరి 10న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పిల్లల కోసం సోషల్ మీడియాపై వయోపరిమితితో కూడిన నియంత్రణ తీసుకురావాలని కోరారు. దీనిపై అధ్యయనం చేసి ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం పటిష్టమైన చట్టాన్ని రూపొందించే పనిలో ఉందని కేంద్ర మంత్రికి వివరించారు.

 

 

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.