Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home International అమెరికా కీలక ప్రకటన చేసింది.

అమెరికా కీలక ప్రకటన చేసింది.

by CVR NEWS

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది.అణ్వాయుధాల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తమ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదని పేర్కొంది. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ చేతిలో చావు తప్పదని హెచ్చరిక చేశారని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో ఖమేనీయే హతమయ్యారని ఆ ప్రకటనలో వెల్లడించింది.యుద్ధం ఇరుపక్షాలకు నష్టం చేకూరుస్తుందని అమెరికా రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాము యుద్ధానికి సిద్ధమైంది ఇరాన్‌లో పాలన మార్చాలనే ఉద్దేశంతో కాదని, కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే దాడులు చేశామని తెలిపింది. అణు స్థావరాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది.
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఖమేనీ ప్రోద్బలంతో తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. అతడు నన్ను పట్టుకోకముందే నేనే అతడ్ని పట్టుకున్నానని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు. కాగా ఇరాన్ పై జరిగిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారన్నారు. అంతా సవ్యంగానే జరుగుతోందన్నారు. ఈ దాడులు ఇప్పుడు ప్రారంభించకుంటే రెండు వారాల్లోనే అణ్వాయుధాలను ఇరాన్ సంపాదించి ఉండేదని ట్రంప్ గుర్తుచేశారు. చమురు ధరలపై ఆందోళన అవసరం లేదని ట్రంప్ తెలిపారు. అంతా మంచే జరుగుతుంది. ఆందళన చెందొద్దు అని ట్రంప్ హామీ ఇచ్చారు.

 

ఇరాన్ పై దాడుల కోసం అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోవడం అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. డెమోక్రాట్లతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు కూడా ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధ యుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇది అమెరికా కాంగ్రెస్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఎలాంటి తక్షణ ముప్పు లేనప్పుడు అధ్యక్షుడు చట్టవిరుద్ధంగా యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ కాంగ్రెస్‌తో సంప్రదించే నిర్ణయం తీసుకున్నారని కాలిఫోర్నియా డెమోక్రాట్ ప్రతినిధి రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు. కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీ, సెనేటర్ రాండ్ పాల్ వంటి కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పారన్నారు.. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, ఇది ‘అమెరికా ఫస్ట్’ విధానం కాదని వారు స్పష్టం చేశారు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగా ఆ దేశంపై భారీ సైనిక దాడులకు ట్రంప్ ఆదేశించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఇరాన్ తక్షణమే ప్రతీకార దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. దీనంతటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయాల ఫలితమేనన్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలని, ఇందుకోసం కాంగ్రెస్‌ను తక్షణమే సమావేశపరచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వారం మధ్యలో దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ వంటి రిపబ్లికన్ అగ్ర నాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా ఈ అధికారం ఉందని వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విస్తరిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: