ఒడిషాకు చెందిన ఓ మర్చంట్ నేవీ అధికారి నడి సంద్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. మారిషస్ సమీపంలో ఓ నౌకలో విధులు నిర్వహిస్తున్న సార్థక్ మహాపాత్రో… మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. గతేడాది జులైలో ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో సార్థక్ ఉద్యోగంలో చేరారు. అతడు ప్రయాణిస్తున్న నౌక సింగపూర్ నుంచి చైనాకు తిరిగివస్తోంది. సోమవారం నాడు తల్లిదండ్రులు, స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడిన సార్థక్ ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం తల్లి మరోసారి కాల్ చేయగా.. సార్థక్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాక కొద్ది సేపటికి… సార్థక్ కనిపించడం లేదంటూ షిప్పింగ్ కంపెనీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. దీనిపై సార్థక్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని, తమ కుమారుడిని త్వరగా ఇంటికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సార్థక్ ఫిబ్రవరి 3న తన క్యాబిన్‌లోకి వెళ్లినట్లు రికార్డుల్లో ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. నౌక మొత్తం గాలించినా అతడి ఆచూకీ తెలియరాలేదన్నారు. సముద్ర ప్రాంతంలో తనిఖీలు ప్రారంభించామన్నారు.