Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Sports టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.

by CVR NEWS

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ , కెప్టెన్ బట్లర్ , హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివమ్ దూబే దూకుడుగా ఆడగా, చివర్లో తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా, జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా…. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది.

Advertisements

You may also like

Our Visitor

007259
Total views : 47727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.