Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Sports వరుసగా డకౌట్ అవుతున్న అభిషేక్ శర్మకు గవాస్కర్ సలహా…

వరుసగా డకౌట్ అవుతున్న అభిషేక్ శర్మకు గవాస్కర్ సలహా…

by CVR NEWS

టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో, ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది. అంచనాల భారమే 25 ఏళ్ల అభిషేక్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని, అతను భారీ షాట్ల కోసం తొందరపడకుండా క్రీజులో సమయం గడపడంపై దృష్టి పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వరుస వైఫల్యాలతో, టీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆశిష్ నెహ్రా సరసన అభిషేక్ నిలిచాడు. స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ, అభిషేక్ మంచి ఆటగాడే, కానీ అంచనాలు అతనిపై భారం మోపుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి బంతికే బౌండరీ లేదా సిక్స్ కొట్టాలని ప్రయత్నించకూడదని, భారీ షాట్లు వాటంతట అవే వస్తాయనీ, బలవంతంగా ఆడకూడదంటూ విశ్లేషించాడు.

అమెరికాపై గోల్డెన్ డక్‌తో మొదలైన అభిషేక్ వైఫల్యం, పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలోనూ పునరావృతమైంది. ప్రతీసారి ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ముందు ఒక పరుగు తీసి ఖాతా తెరవాలి. నాలుగైదు బంతులు డాట్ అయినా ఫర్వాలేదు, తర్వాత కవర్ చేయొచ్చు. కాస్త క్రీజులో కుదురుకుంటే, అతని సహజమైన ఆట అదే బయటకు వస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే, అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ధీమా వ్యక్తం చేశాడు. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్, కోలుకున్న తర్వాత నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడని తెలిపాడు. నెట్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని… త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడన్నారు.. సూపర్ 8 దశ నాటికి అతను కీలకంగా మారతాడని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కీలకమైన సూపర్ 8 దశకు ముందు అభిషేక్ తిరిగి లయ అందుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.