హైదరాబాద్ శివారులో విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ముసుగులో లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతూ…. తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. పోనీ వాటికి అన్ని అనుమతులు ఉన్నాయా అంటే అదీ లేదు. ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే ఎడ్యుకేషన్ దందా నిర్వహించేస్తున్నారు. కిష్టాపూర్‌లో నడుస్తున్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. “ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్” పేరుతో విద్యార్థులను ఆకర్షిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారికంగా ఈ విద్యాసంస్థకు ఉన్న అనుమతి కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అయినప్పటికీ, యాజమాన్యం దర్జాగా 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా… దీనిపై విచారణ జరపాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి MEO కు లేఖ రాశారు. ఆరోపణలు రుజువైతే రోజుకు రూ. 10 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించారు. అయితే ఇది జరిగి ఐదు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఓ వైపు ఈ అంశంపై విచారణ సాగుతుండగానే… ఇదేమీ పట్టించుకోకుండా యాజమాన్యం యథేచ్ఛగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ, స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ద్వారా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని పేరెంట్స్ గట్టిగా కోరుతున్నారు.





Total views : 47734