ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా, పరిశోధన, పారిశ్రామిక సంస్థల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల జరిపిన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రతినిధులను ఆహ్వానించి, ఏపీలో ఉన్న రాయితీలను వివరించిన ఫలితంగా ఈ చరిత్రాత్మక భాగస్వామ్యం సాధ్యమైంది. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఎంవోయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలలో భాగంగా విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా ఐఐటీ తిరుపతిలో ‘సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నాయి. అంతకుముందు సీఎం చంద్రబాబును ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ఆస్ట్రేలియా బృందానికి సీఎం వివరించారు.
ఆస్ర్టేలియా మంత్రి జూలియన్ తో మంత్రి లోకేష్ భేటీ.
113
previous post