అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో తరగతులను పునరుద్ధరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. చింతలపూడి పంచాయతీ పరిధిలోని గింజర్తి ఎంపీపీ పాఠశాలలో ఎత్తివేసిన 3వ, 4వ, 5వ తరగతులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు నాలుగు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు.
గింజర్తి గ్రామంలో గతంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధన సాగేదని, ప్రస్తుతం 3, 4, 5 తరగతులను ఎత్తివేయడంతో చిన్నారులు చదువులకు దూరమయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న చింతలపూడి, లొద్దుపాక మోడల్ స్కూళ్లకు చిన్నారులను పంపించడం తమ వల్ల కాదని వారు చెబుతున్నారు.
దాదాపు 45 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, గత ఆరు నెలలుగా వారి చదువులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించి గింజర్తి ఎంపీపీ పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.