Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

by CVR NEWS

ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన హాజరై ప్రసంగించారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలా చేయకపోతే, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందని… అందుకే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఇటీవల డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, అయితే దానికి ప్రభుత్వం గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగిందని గుర్తుచేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న వాస్తవాలు చెప్పడం వల్లే.. గొడ్డలి పార్టీ మినహా కొన్ని ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని చెప్పారు. ఇప్పుడు అదే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లే గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేపట్టారని చంద్రబాబు వివరించారు.

ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే, కుట్రలను వారే ఛేదిస్తారని అన్నారు. దీనికి కర్నూల్‌లో టీచర్లు గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనే నిదర్శనమని తెలిపారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెడుతూ సంక్షేమం-అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

సాధారణ కార్యకర్త నుంచి అగ్ర నాయకుడి వరకు అందరికీ పార్టీనే సుప్రీం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలను పట్టించుకోని వారిని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో ‘జీరో టాలరెన్స్’ పాటిస్తామని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని అన్నారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా, ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి, నాయకుడి ప్రవర్తన ఓట్లపై ప్రభావం చూపుతుందని, యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లకు, మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: