కాకినాడలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కత్తిపూడి వద్ద గోదావరి జలాలకు నమస్కరించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో సీటు త్యాగం చేస్తే నిలిచిపోయిన పురుషోత్తపట్నం ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టును అడ్డుకునేందుకు అప్పటి ఎమ్మెల్యే, ఎంపీలు లేఖలు ఇచ్చారని, రైతులు రోడ్డెక్కినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ పోరాటంతోనే పురుషోత్తపట్నం ప్రాజెక్టు పూర్తయిందన్నారు.
చంద్రబాబు రూ.1,650 కోట్లతో ఎనిమిది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని వర్మ తెలిపారు. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని ఐదు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందుతుందని, లక్ష ఎకరాలకు రెండు పంటలకు నీరు లభిస్తుందని చెప్పారు. ఏలేరు నుంచి తాండవకు నీటిని తరలించే ప్రయత్నాలను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అడ్డుకోవాలని, పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును ఐదు జిల్లాలకు అపర భగీరథుడిగా అభివర్ణించారు.