తిరుమల శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమలలో రెండో రోజు పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1999లో తాను ప్రారంభించిన మ్యూజియాన్ని ఇప్పుడు ఆధునికీకరించామని చెప్పారు. వేంకటేశ్వరస్వామి చరిత్ర అందరికీ అర్థమయ్యేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ట్రస్టుకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. రాబోయే ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ట్రస్టుకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి భక్తుడికి భద్రత కల్పించేందుకు ఎల్‌ఐసీ ద్వారా రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆధార్ ఆధారిత పేపర్‌లెస్ క్లెయిమ్ సదుపాయాన్ని తీసుకొచ్చామని చెప్పారు. తిరుమలలో పవిత్ర భావం కొనసాగాలని.. రాజకీయాలకు వేదికగా మారకూడదని స్పష్టం చేశారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదని.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తిరుమలలో కొత్తగా 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించినట్లు చంద్రబాబు చెప్పారు. రిలయన్స్ 25, భారత్ బయోటెక్ సంస్థ 7 బస్సులను అందించిందని తెలిపారు. సేవాభావంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారని.. వారిలో వైద్య, విద్యా రంగాలకు చెందిన సేవకులు కూడా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు.