ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వ నివేదికలు, గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ప్రభుత్వం 1065, 105 జీవోలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జీవోలను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
విచారణ సందర్భంగా 34 శాతం రిజర్వేషన్లకు కమిషన్ చేసిన అధ్యయనం, అందుకు ఆధారంగా తీసుకున్న గణాంకాలపై ధర్మాసనం వివరాలు కోరింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ నివేదికతో పాటు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.