విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద భారీగా చిరిగిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. పార్కు ఎదురుగా కుప్పగా పడి ఉన్న నోట్లను మార్నింగ్ వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నోట్ల కుప్పను పరిశీలించారు. అందులో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. కరెన్సీ నోట్లతో పాటు కొన్ని ఎల్ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా లభించడంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి.
అసలు ఈ నోట్లను అక్కడ ఎవరు పడేశారు? కావాలనే నోట్లను చింపి పడేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోట్లతో పాటు లభించిన పత్రాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల మిస్టరీపై పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుందనేది ఆసక్తికరంగా మారింది.