సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులంతా పటాన్‌చెరులోని శిరీష మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు చెరువులోకి దిగినట్లు సమాచారం. లోతైన గుంతను గుర్తించకపోవడంతో ఒక విద్యార్థి నీటిలో జారిపడగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయారు. ఈత వచ్చిన ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతుల్లో బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు.
ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, రెస్క్యూ సిబ్బంది, లైఫ్ జాకెట్లు, ఈతగాళ్ల అందుబాటుపైనా విచారణ కొనసాగుతోంది. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిని సందర్శించారు.