గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి నెల రోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న జాగర్లమూడి భరత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. అనంతరం ఇంటి వద్ద ఉన్న TVS స్టార్ సిటీ మోటార్‌సైకిల్‌ను తీసుకుని పరారయ్యాడు.
తెనాలి ఐతానగర్లో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. సెప్టెంబర్ 16న తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో సుమారు 40 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల పూసల గొలుసు, 18 గ్రాముల మరో బంగారు గొలుసు, మోటార్‌సైకిల్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.7.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరితగతిన అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.