అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కీ పంచాయతీ దేవరపల్లి గ్రామంలో గిరిజన కుటుంబాలు తీవ్ర తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ పైపులైన్ వేసినప్పటికీ, కుళాయిల్లో నీరు రాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు తవ్వి వదిలేయడం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఉపయోగం లేకపోవడం స్థానికులను మరింత నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళలు పొలాల దగ్గరికి వెళ్లి బురద నీరు తెచ్చుకునే దుస్థితి నెలకొంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో, ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలు తీర్చేందుకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ, అల్లూరి జిల్లా దేవరపల్లి గ్రామంలో పరిస్థితి మాత్రం మారడం లేదు. 16 లక్షలు ఖర్చు చేశామని చెబుతున్న అధికారులు, కానీ 16 రోజులు కూడా నీరు రాలేదని గ్రామస్తులు అంటున్నారు. వేసవి కాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, గిరిజన కుటుంబాలు పక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు ఉన్నప్పటికీ అవి పనికిరావడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గిరిజన మహిళలు హెచ్చరిస్తున్నారు.





Total views : 81453