డమ్మీ కరెన్సీ నోట్లను ఒరిజినల్ నోట్లుగా చూపించి అమాయకులను మోసం చేసే ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి రెండు కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ నోట్లను, 8 ఒరిజినల్ 500 రూపాయల నోట్లను, మోసానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని భీమవరంకు చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బయటపెట్టాడని పోలీసులు తెలిపారు.
భీమవరం కు చెందిన శివ శంకరకు బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన కొవ్వూరి గోపి చంద్ర రెడ్డి, జంగారెడ్డిగూడెం కు చెందిన వేముల మోహన్ సాయిలు ఫోన్ చేసి ఒరిజినల్ లక్ష రూపాయలు నోట్లు ఇస్తే మూడు రెట్లు ఫేక్ కరెన్సీ ఇస్తామని నమ్మబలికినట్లు సిఐ నాగరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శివ శంకర్ వారి ఉచ్చులో పడకుండా వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యూహం పన్ని నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. మూడు లక్షలు ఒరిజినల్ నోట్లు ఇస్తామని శివ శంకర్ ద్వారా వారికి సమాచారం ఇవ్వగా, వారు భీమవరం ఏఎంసీ మార్కెట్ యార్డ్ వద్దకు రావడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగిందని సిఐ వెల్లడించారు. అయితే వీరికి డమ్మి నోట్లు సరఫరా చేస్తున్న జంగారెడ్డిగూడెం కి చెందిన బర్రె సుధీర్ మాత్రం పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సులభంగా అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ప్రజలు నమ్మవద్దని, మోసపోవద్దని ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని సీఐ నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




Total views : 78950