ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మరో ఆందోళనకర పరిస్థితి వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూనే కొందరు డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు, క్లినిక్‌లు ఏర్పాటు చేసి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోనే ఆసుపత్రి సూపరిండెంట్‌తో పాటు మరో ప్రభుత్వ వైద్యురాలు కలిసి మహిత హాస్పిటల్ పేరుతో ప్రైవేట్ వైద్యం నిర్వహిస్తూ ఓపీలు, శస్త్రచికిత్సలు చేస్తూ భారీగా డబ్బులు ఆర్జిస్తున్నారని సమాచారం. ఇంకా ఇద్దరు వైద్యులు ఆమనగల్లు ప్రాంతంలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విష్ణుపాలి క్లినిక్‌ల పేరుతో ప్రైవేట్ సేవలు అందిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక ఆర్థోపెడిక్ వైద్యుడు అయితే 24 గంటల ఎమర్జెన్సీ సేవల పేరుతో పెద్దఎత్తున వసూళ్లు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే చర్యలు తీసుకుని నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరో వైపు నియోజకవర్గంలో మరో పెద్దదైన ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి .. అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఉంది… ఆమనగల్లు మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో 17 కోట్ల రూపాయలతో 50 పడగల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు.. రెండు సంవత్సరాలు పూర్తయిన ఇంకా ప్రారంభం కాలేదు .త్వరలో ప్రారంభం చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే అన్ని మౌలిక వసతులతో పాటు , అందుబాటులో ఉన్న డాక్టర్లు కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్లను కేటాయించాలని, సరిపడా సిబ్బందిని నియమించి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు . ఇప్పటికే రేకుల షెడ్డులో కొనసాగుతున్న కమ్యూనిటీ సెంటర్ ను కొత్త భవనంలోకి మార్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు, అలాగే నాసిరకం మందులు వైద్యులు అందజేస్తున్నారని వాటితో రోగం నయం కాక సతమతమవుతూ మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుందని , కాంట్రాక్టర్లు సరైన మందులను పంపిణీ చేసేలా జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు .





Total views : 81448