పెరూలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన నాజ్కా నగర సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాజ్కా లైన్స్ వీక్షణ కోసం విదేశీ పర్యాటకులతో వెళ్తున్న ఒక విమానం సమీపంలోని పొలాల్లో కుప్పకూలిన ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 11 మంది విదేశీ పర్యాటకులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది మృతి చెందినట్లు పెరూ వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతుల్లో ఏడుగురు ఇటలీ, ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇకా నగరం నుండి బయలుదేరిన ఈ విమానాన్ని పెరూకి చెందిన ఏరోడియానా అనే సంస్థ నిర్వహిస్తోంది. గత 14 ఏళ్లుగా నాజ్కా లైన్స్ సందర్శన కోసం ఈ సంస్థ సెస్నా గ్రాండ్ కారవాన్ రకం విమానాలను ఉపయోగిస్తోంది. శతాబ్దాల క్రితం పెరూలోని ప్రాచీన నివాసులు ఎడారి నేలపై రూపొందించిన విలక్షణమైన జంతువుల ఆకృతులు, భౌగోళిక రేఖలను నాజ్కా లైన్స్ అని పిలుస్తారు. వీటిని కేవలం ఆకాశ మార్గం లేదా ప్రత్యేక వీక్షణ టవర్ల ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పెరూ అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.
ఘోర విమాన ప్రమాదం.. 13 మంది దుర్మరణం.
93
previous post