అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పలువాహనాలపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
International
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని అద్భుత శిల్పకళ, నిర్మాణ వైభవాన్ని చూసి టిఫానీ ట్రంప్ మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన నీలకంఠ్ వర్ణీ విగ్రహాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుని, ఆలయ సౌందర్యంపై ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా టిఫానీ త్వరలో ఆగ్రాకు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. అక్కడ సుమారు గంటన్నర పాటు గడిపిన అనంతరం జైసల్మేర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, టిఫానీ ట్రంప్‌కు ఇది తొలి భారత పర్యటన కాదు. 2018లో తండ్రి డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆమె కూడా భారత్‌కు వచ్చారు.
భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది. భారతదేశానికి చెందిన అత్యంత ఆదరణ పొందిన మామిడి పండ్ల ఎగుమతులపై జపాన్ ప్రభుత్వం హఠాత్తుగా విధించిన ఈ నిషేధం దేశీయ వ్యవసాయ వాణిజ్య రంగానికి భారీ ఎదురుదెబ్బగా మారింది. గడిచిన 20 సంవత్సరాలలో జపాన్ ఇలా భారత మామిడి పండ్లపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ప్రస్తుత సీజన్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా జపాన్ వ్యవసాయ, అటవీ, మత్స్య మంత్రిత్వ శాఖ ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిషేధం కారణంగా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన భారతదేశపు ప్రీమియం మామిడి రకాలైన అల్ఫోన్సో , కేసర్ , లంగ్డా , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఎగుమతి అయ్యే బంగినపల్లి రకాల రవాణా జపాన్ మార్కెట్‌కు పూర్తిగా నిలిచిపోయింది.
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా కేసులు కలవరపెడుతున్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఎబోలాతో 220 మందికిపైగా మృతి చెందగా..మరో 101 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఎబోలా అంతకంతకూ పంజా విసురుతుండటంతో పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును వెంటనే మూసేయాలని అధికారులను ఆదేశించింది. సరిహద్దు దాటి వచ్చిన కాంగో ప్రజల నుంచి స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకడం, ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. దాదాపు 220 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 101 కేసులు నిర్ధారణ అయ్యాయని.. మరో 3వేల మంది కాంటాక్ట్‌ల గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉగాండాలో ఏడు ఎబోలా కేసులు నమోదయ్యాయి. మొదటి కేసుగా బయటపడిన 59 ఏళ్ల వ్యక్తి.. మే 14న రాజధాని కంపాలాలో మృతి చెందారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని..షేక్ హ్యాండ్ వద్దని, శానిటైజర్ వాడాలని అధికారులు సూచించారు.
మరోవైపు భారత్‌లో.. కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్త సహా నలుగురిని గుజరాత్ ప్రభుత్వం ఐసోలేషన్ చేసింది. అహ్మదాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రుల్లో వారిని చేర్చింది. వారి నమూనాలను ఎబోలా పరీక్ష కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ తెలిపారు. బెంగళూరులోనూ ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో.. వైద్య విభాగం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి ఒకపక్క సన్నద్ధమవుతున్న అమెరికా మరోపక్క ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగక్షేత్రాలను, సముద్రంలో మందుపాతరల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్య సైన్యం పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయరక్షణ కోసమే తమ బలగాలు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హాకిన్స్ సమర్థించుకున్నారు. తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు తమ దేశానికి చెందిన రెండు విమానవాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు ముప్పుగా పరిణమించినట్లు వివరించారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నౌకాదళ స్థావరం ధ్వంసమైనట్లు చెప్పారు. ఇరాన్‌లోని లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అమెరికా దాడుల్ని ఇరాన్ ఖండించింది. ఒప్పందం కుదిరే దిశగా చర్చలు జరుగుతుంటే ఉద్దేశపూర్వక వంచనను, అవాస్తవికతను చాటేలా ఇవి ఉన్నాయని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత అని స్పష్టంచేసింది. దురాక్రమణ చర్యలన్నింటికీ బదులిస్తామని హెచ్చరించింది.
గాజా ప్రాంతంలో హమాస్ కీలక నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారీ వైమానిక దాడి నిర్వహించింది. హమాస్ మిలిటరీ విభాగానికి ఇటీవలే చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.ఈ దాడిలో ఒడెహ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో ఒడెహ్ కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ సమయంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన ఒడెహ్… ఇజ్రాయెల్ సరిహద్దు బలహీనతలపై సమాచారాన్ని సేకరించి దాడి వ్యూహరచనలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంది.ఒడెహ్ మరణాన్ని ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. కాగా, కొద్ది రోజుల క్రితం హమాస్ మిలిటరీ చీఫ్ ఎజ్జెదిన్ అల్ హద్దాద్‌ను కూడా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఒడెహ్.. కేవలం 11 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది.హెజ్బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని , దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది.
ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యంలోకి కొత్త రిక్రూట్లను ఆకర్షించేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్లో పోరాడటానికి సైన్యంలో చేరే కొత్త రిక్రూట్లు, ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనికులకు సంబంధించిన అప్పులను పూర్తిగా రద్దు చేస్తూ రష్యా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యం బలాన్ని పెంచేందకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యంగ్‌స్టర్స్ యుద్ధంలోకి దించడానికి రష్యా క్రెమ్లిన్ ఈ వినూత్న ఆర్థిక ప్యాకేజీని అస్త్రంగా ఎంచుకుంది.
అయితే, సైన్యంతో కనీసం ఓ సంవత్సరం పాటు పోరాడటానికి ఒప్పందం కుదుర్చుకునే ఏ రష్యన్ పౌరుడైనా ఈ అప్పుల విముక్తికి అర్హుడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వ డీల్ ఒప్పుకుంటే పాత బ్యాంక్ లోన్లు, వినియోగదారుల రుణాలు సుమారు 10 మిలియన్ రూబుల్స్ అంటే భారత భారత కరెన్సీలో 1.33 లక్షల వరకు పూర్తిగా మాఫీ కానున్నాయి. కేవలం సదరు సైనికుడికే కాకుండా, అతని భార్య పేరిట ఉన్న రుణాలకు కూడా ఈ లోన్ వైవర్ వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
భారత్–అమెరికా సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. అరుదైన ఖనిజాల సరఫరా మరియు సహకారంపై ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో సంతకాలు చేశారు.కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా, పరిశోధన, సాంకేతిక సహకారంపై ఇరు దేశాలు కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మరియు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో అధికారికంగా సంతకాలు చేశారు.ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, హైటెక్ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం పెంచుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
దేశంలోని విమానాశ్రయాలు, సముద్ర తీర పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వైరస్ గుర్తింపు, టెస్టింగ్, నిఘా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థలకు సూచనలు చేశారు. కేంద్రమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశమై వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.




Total views : 140772