బీజేపీ పన్నిన కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ, డీలిమిటేషన్ పేరుతో కావాలనే చిక్కుముళ్లు తెచ్చిపెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసింది బీజేపీ అని ధ్వజమెత్తారు. మహిళా సాధికారతపై బిజెపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నేటి పరిణామాలతో తేలిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదని.. కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కళ్లారా చూశారని తెలిపారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. ఇప్పటికైనా తన నిజాయితీని నిరూపించుకోవాలంటే డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి, రానున్న ఎన్నికల నుంచే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్..
111





Total views : 81437