పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు. కఠోర శ్రమ తోడైతే రికార్డులు మీ వెంటే వస్తాయి. దీనిని అక్షరాలా నిజం చేసి చూపించింది మధ్యప్రదేశ్‌కు చెందిన నందిని అగర్వాల్. కేవలం 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులోనే కఠినమైన సీఏ పరీక్షను క్లియర్ చేసి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని మొరేనా వంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన నందిని, చదువులో మొదటి నుంచి టాపర్. 13 ఏళ్లకే 10వ తరగతి, 15 ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 2021లో జరిగిన సీఏ ఫైనల్స్‌లో దాదాపు 83 వేల మందితో పోటీ పడి, 800 మార్కులకు గానూ 614 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకుంది.
నందిని సాధించిన ఈ విజయంలో ఆమె కుటుంబం పాత్ర మరువలేనిది. నందిని టాపర్‌గా నిలిచిన అదే ఏడాది, ఆమె అన్నయ్య సచిన్ కూడా సీఏ ఫైనల్స్‌లో 18వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఒకే ఇంట్లో ఇద్దరు తోబుట్టువులు దేశస్థాయి ర్యాంకులతో సీఏలు కావడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. నందినిలో ఈ కసి ఈనాటిది కాదు. 11వ తరగతి చదువుతున్నప్పుడు తన స్కూల్‌కు వచ్చిన ఒక గిన్నిస్ రికార్డు గ్రహీతను చూసి స్ఫూర్తి పొందింది. ఎలాగైనా తాను కూడా ఒక అరుదైన రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడిపి, మొండి పట్టుదలతో చదివి అనుకున్నది సాధించింది.
ప్రస్తుతం నందిని కేవలం సీఏ మాత్రమే కాదు.. ప్రముఖ సంస్థ పీడబ్ల్యూసీలో అనుభవం గడించి, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్‌గా కూడా రాణిస్తోంది. ఆరు లక్షల మంది ఫాలోవర్లతో ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఖర్చు చేసే ముందే ఇన్వెస్ట్ చేయాలంటూ యువతకు ఫైనాన్షియల్ పాఠాలు చెబుతోంది. ఒక సాధారణ మధ్యాహ్నం వచ్చిన ఈమెయిల్ తన జీవితాన్ని మలుపు తిప్పిందని నందిని ఆనందంగా చెబుతోంది. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, ఆశయం గొప్పదైతే ఏదీ అడ్డంకి కాదని నిరూపించిన నందిని అగర్వాల్.. నేటి యువతకు నిజమైన రోల్ మోడల్‌గా నిలిచింది.





Total views : 47733