ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశాభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా.. ఈ ఏడాది సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను విస్తరించడంపై చర్చించారు.
ఈ హై ప్రొఫైల్ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, అస్థిరతల మధ్య కూడా భారత్ తన ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగిస్తోందని మోదీ స్పష్టం చేశారు. కొత్త ఉపాధి, ఎగుమతుల అవకాశాల కోసం భారత్ అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలను జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం, సమన్వయంతో ముందుకు సాగడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. అలాగే 2025 డిసెంబర్‌లో జరిగిన 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో వచ్చిన సిఫార్సులను కూడా సమావేశంలో సమీక్షించారు. ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమాల అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చలు జరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.




Total views : 202970