దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణ్ అధికారిక ఈ-మెయిల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు సందేశాన్ని పంపించారు. ఈ మెయిల్‌లో ఇస్రోకు చెందిన కీలక కార్యాలయాలు, శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొనడంతో భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు ఇస్రోకు చెందిన ప్రధాన కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. బెదిరింపు మెయిల్ అందిన వెంటనే దానిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అన్ని కేంద్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఇది బూటకపు బెదిరింపుగా అనుమానిస్తున్నప్పటికీ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎవరు పంపారు? అనే కోణాల్లో పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్, సర్వర్ వివరాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటీవల దేశంలోని కీలక ప్రభుత్వ సంస్థలు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో… ఇస్రో వంటి అత్యంత కీలక వ్యూహాత్మక సంస్థకు బెదిరింపు రావడం జాతీయ భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
ఇస్రోకు గుర్తుతెలియని వ్యక్తుల బాంబు బెదిరింపు.
157




Total views : 214653