భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవస్థలో సెబీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్వెస్టర్లకు మెరుగైన అవకాశాలు కల్పించడం, మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడంతో పాటు, F&O విభాగంలో ఉన్న స్టాక్స్‌కు ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ను ప్రవేశపెట్టారు. తాజా నిబంధనల ప్రకారం, F&O విభాగంలోని స్టాక్స్ కు రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3.15 కు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మొదలవుతుంది.
3.15 నుంచి 3.20 వరకు ట్రాన్సిషన్ పీరియడ్ , 3.20 నుంచి 3.25 వరకు క్యాస్ ఆర్డర్ ఎంట్రీ ఉంటుంది.ఈ దశలో మార్కెట్ ఆర్డర్లను మార్చడానికి లేదా రద్దు చేయడానికి వీలుండదు. చివరి రెండు నిమిషాల్లో యాదృచ్ఛికంగా వేలం ముగుస్తుంది. 3.30 నుంచి 3.35 వరకు ఆర్డర్ మ్యాచింగ్ ఉంటుంది. ఈ సెషన్‌లో కనుగొన్న ధరనే ఆ రోజుటి అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు. అయితే, నాన్-F&O ఈక్విటీ క్యాష్ స్టాక్స్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని, యథావిధిగా మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుందని సెబీ స్పష్టం చేసింది.
మరో కీలక మార్పుగా ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ సమయాన్ని 10 నిమిషాలు పొడిగించారు. దీంతో ట్రేడింగ్ సాయంత్రం 3.40 వరకు కొనసాగుతుంది. అలాగే, ప్రీ-ఓపెన్ సెషన్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 9.07 వరకు మాత్రమే ఆర్డర్ ఎంట్రీ విండో అందుబాటులో ఉంటుంది. 9.07 నుంచి 9.15 మధ్య ఆర్డర్లు మ్యాచ్ అవుతాయి. యథావిధిగా 9.15 కు రెగ్యులర్ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. సరైన ధరల గుర్తింపు , మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లిక్విడిటీని పెంచడం, పెట్టుబడిదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, పాసివ్ ఫండ్స్ ట్రాకింగ్ ఎర్రర్‌ను తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మార్పులు తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది. ఈ కొత్త మార్పులు భారత స్టాక్ మార్కెట్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నేటి నుంచి స్టాక్ మార్కెట్‌కు కొత్త టైమింగ్స్.
90
previous post