ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు, అంతర్ దృష్టి, ఆశావాదం ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. భారత్ అంతరిక్ష రంగంలో వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో యువ స్టార్టప్‌ల పాత్ర కీలకంగా మారుతోందని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ అంతరిక్ష ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై స్టార్టప్‌ల ప్రతినిధులతో చర్చించినట్లు మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి యువ పారిశ్రామికవేత్తల ఆలోచనలు దోహదపడతాయని అన్నారు. ఇదే సందర్భంగా భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ప్రజలను అత్యంత ఉత్తేజపరిచే అంశం ఏమిటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. అంతరిక్ష రంగంలో భారత్ భవిష్యత్ ప్రగతిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.