ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో EPFO వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదం లభించింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని పెంచారు. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి రానున్నారు.
కొత్త వేతన పరిమితి 2026 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి రానుంది. రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య వేతనం పొందే ఉద్యోగులకు EPF, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధి విస్తరించనుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.11,339 కోట్ల అదనపు వ్యయం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
వేతన పరిమితి పెంపుతో మరింత మంది ఉద్యోగులకు పదవీ విరమణ పొదుపులు, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి. పెరుగుతున్న వేతనాలు, అధికారిక ఉద్యోగాల విస్తరణకు అనుగుణంగా EPFO పరిధిని పెంచినట్లు కేంద్రం తెలిపింది. దీర్ఘకాలిక సామాజిక భద్రతను విస్తరించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని వెల్లడించింది.