ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ లతో పాటు మరో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధించారు. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
అసలు ఈ కేసు వివరాలకొస్తే..2020 జూన్ 19న కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలతో వ్యాపారి జయరాజ్, అతడి కుమారుడు బెనిక్స్లను తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్లో రాత్రంతా వారిని పాశవికంగా చిత్రహింసలకు గురిచేయడంతో, తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచారనేది అబద్దమని విచారణలో తేలింది. అంతేకాదు ఆ రాత్రంతా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అత్యంత క్రూరంగా శారీరక మరియు లైంగిక హింసకు గురిచేశారని తేలింది. అంతేకాకుండా పోలీసుల దెబ్బలకు బాధితులకు రక్తంవస్తే బాధితులే స్వయంగా ఆ రక్తపు మరకలను తుడిచివేసేలా పోలీసులు వారిని బలవంతం చేశారని విచారణలో వెల్లడైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడంతో మద్రాస్ హైకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణను సీబీఐకి అప్పగించింది. సీబీఐ పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులను అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేసింది సీబీఐ. తండ్రీకొడుకులను రాత్రంతా దారుణంగా కొట్టారని, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సత్తాంకుళం పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని సైతం మాయం చేసినట్లు సీబీఐ విచారణలో నిర్ధారణ అయింది. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ దారుణానికి పాల్పడిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.
మృతుల కుటుంబానికి నిందితుల నుండి మొత్తం 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో ప్రధాన నిందితుడైన అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌కు15 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే కోర్టు తీర్పుపై స్పందించారు జయరాజ్ కుటుంబసభ్యులు. తమకు న్యాయం జరిగిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఏ పోలీసు అధికారి కూడా సామాన్యుడిపై చెయ్యి ఎత్తడానికి భయపడేలా చేస్తుందని ఆవేదనతో కూడిన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ తీర్పు ద్వారా పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలని, కస్టోడియల్ హింసకు ముగింపు పలకాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





Total views : 38491