Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Devotional త్వరలో తెరుచుకోనున్న పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం…

త్వరలో తెరుచుకోనున్న పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం…

by CVR NEWS

ఒక చిన్న దుర్ఘటన.. అప్పటి వరకు ఉన్న ఘన చరిత్రను కాలరాస్తుంది. ఒక్క లోపం.. అప్పటి వరకు ఉన్న మంచి పేరును చెరిపేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆధ్యాత్మిక వేత్త హరిముకుంద పాండా విషయంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి కష్టపడి ఆయన నిర్మించుకున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యం… ఒక విషాద ఘటనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస అంటే కేవలం జీడి పరిశ్రమకు మాత్రమే కాదు, దానధర్మాలకు, అచంచలమైన దైవభక్తికి కూడా పెట్టింది పేరు. ఆ గడ్డపైనే పేదల పెన్నిధిగా, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా వెలుగొందారు హరిముకుంద పండా. ఆయన జీవితం ఒక సేవా యజ్ఞం లాంటిది. కానీ వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన దుర్ఘటనతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది.

కాశీబుగ్గకు చెందిన ​హరిముకుంద పండా.. స్వతహాగా భూస్వామి. అయితే డబ్బు ఉందన్న అహం ఆయనలో ఎన్నడూ లేదు. ఎంత ధనవంతుడో అంతకంటే పెద్ద మనసున్న మనిషి. సామాన్యుడి ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కావడంతో, తన వద్దకు వచ్చే ప్రతి పేదవాడికి ఆశ్రయం కల్పించేవారు. తన నివాసానికి వచ్చిన ఎవరినీ ఖాళీ కడుపుతో పంపకూడదనేది ఆయన సిద్ధాంతం. ప్రతినెలా పేద ప్రజలకు మనిషికి 200 నుండి 400 రూపాయల వరకు పెన్షన్ అందిస్తూ, వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపేవారు. ఆ కాలంలో ఇది సామాన్యమైన విషయం కాదు. వేలాది కుటుంబాలకు ఆయన ఒక అదృశ్య హస్తంలా అండగా నిలిచారు.

దైవభక్తి మెండుగా ఉన్న పండా… ఆధ్యాత్మికతను సామాన్యులకు చేరువ చేయాలని సంకల్పించారు. తనకున్న 12 ఎకరాల సువిశాల భూమిలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, వేలాది మంది భక్తుల నమ్మకానికి వేదిక. ఈ క్షేత్రం పలాస పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది. అందరూ దీన్ని చిన్న తిరుపతి అని పిలుచుకునేవారు.

అంత వైభవంగా వెలుగొందిన ఆ ఆలయ చరిత్రలో గత ముక్కోటి ఏకాదశి చీకటి రోజుగా మిగిలిపోయింది. పర్వదినాన స్వామివారి దర్శనం కోసం పోటెత్తిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం నింపింది. ఆ పవిత్ర స్థలంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనతో హరిముకుంద పండాతో పాటు భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ దుర్ఘటన తర్వాత ఆలయం చాలా కాలంగా మూతపడి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆలయంలో దొంగలు పడి… దేవతా విగ్రహాల మీద ఉన్న బంగారమంతా ఎత్తుకెళ్లారు. అయితే దీనిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజ్‌ చేసిన ఆలయంలో నుంచి నగలు మాయమైతే బాధ్యత వహించాల్సింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హరిముకుంద పండా మాత్రం త్వరలోనే ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని… నగలు మళ్లీ తయారు చేయిస్తున్నామని చెప్పారు…

హరిముకుంద పండా చేసిన సేవలు పలాస చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవి. ఒక వ్యక్తి తన సొంత భూమిని దైవ కార్యానికి, తన సంపాదనను పేదవారి ఆకలి తీర్చడానికి వెచ్చించడం సామాన్యమైన విషయం కాదు. జరిగిన విషాదం బాధాకరమైనదే అయినా, పండా సేవా కార్యక్రమాలు, ఆయన నిర్మించిన ఆ పుణ్యక్షేత్రం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని పలాస వాసులు కోరుకుంటున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

004903
Total views : 33643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.