Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Sports ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.

by CVR NEWS

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరుకావడంతో..ఈ మ్యాచ్‌తో పాటు ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుక కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

న్యూయార్క్ సమీపంలోని న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. చివరకు 106వ నిమిషంలో ఫెర్రాన్ టొర్రెస్ చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో 2010 తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన స్పెయిన్… తమ రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.

అర్జెంటీనాకు ఇది వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్ కాగా… టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఆశ నెరవేరలేదు. కెప్టెన్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలో పోరాడిన అర్జెంటీనా చివరి వరకు గట్టి ప్రతిఘటన ఇచ్చినా… అదనపు సమయంలో గోల్‌ను అడ్డుకోలేకపోయింది. మరోవైపు స్పెయిన్ యువ ఆటగాళ్లు అద్భుత సమన్వయంతో ఆకట్టుకుని ప్రపంచ ఫుట్‌బాల్‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు.

ఈ ఫైనల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన ట్రంప్… అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. విజేత స్పెయిన్ జట్టుకు పతకాలు, ట్రోఫీ అందజేసే సమయంలో ఆయన మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో కొందరు హూటింగ్ చేశారు. అనంతరం స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ ట్రోఫీని ఎత్తే సమయంలో కూడా ట్రంప్ వేదికపైనే ఉండడంతో ఆ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. చివరకు ఇన్‌ఫాంటినో సూచనతో ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.. మొత్తానికి స్పెయిన్ విజయం ఎంత చర్చనీయాంశమైందో… ట్రంప్ వ్యవహారం కూడా అంతే స్థాయిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.మొత్తంగా ప్రపంచకప్ ఫైనల్… ఆటతో పాటు అనూహ్య పరిణామాలతోనూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: