ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన ఏఐ ఆధారిత టూల్ చాట్ జీపీటీ వస్తూనే సంచలనం సృష్టించింది. దాంతో ప్రత్యర్థి టెక్ సంస్థలు కూడా ఏఐ బరిలో దిగాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ ను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు తన బార్డ్ ను మరింత ఆధునికీకరించే చర్యల్లో భాగంగా గూగుల్ సరికొత్త ఏఐ నమూనా జెమినీని అభివృద్ధి చేసింది. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఇది జెమినీ శకానికి ఆరంభం అని అభివర్ణించారు. సెర్చ్ రిజల్ట్స్ లో ఏఐ సాంకేతికతను చొప్పించి ప్రజలకు అందించడానికి డీప్ మైండ్ ఏఐ ల్యాబ్ ను స్థాపించాం వివరించారు. ఆనాటి మా ఆలోచనలకు వాస్తవరూపమే ఈ జెమినీ ఏఐ నమూనా అని తెలిపారు. దీనికి సంబంధించిన పరిశోధనలను మేం ఎంతో ధైర్యంగా, బాధ్యతతో చేపడుతున్నాం అన్నారు. ఓ లక్ష్యం దిశగా ఆవిష్కరణలు చేయడం, ప్రజలకు, సమాజానికి అపారమైన ప్రయోజనాలు చేకూర్చే సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం మా ప్రాధాన్యత అంశాలు అని పేర్కొన్నారు.
international new
ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో 14 మంది స్పాట్ లోనే చనిపోగా మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టిందని వివరించారు. అయితే, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు వివరించారు.
Read Also..
Read Also..
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆరు పార్టీల కూటమి జొరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ విజయం సాధించింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా జెడ్ పీఎం కూటమి 27 చోట్ల విజయం సాధించింది. అధికార ఎంఎన్ఎఫ్ 10, బీజేపీ 2, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించాయి.
ఈ ఎన్నికల్లో మిజోరం సీఎం జొరామ్ తంగా ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. మిజోరం అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలు.
మాజీ ఐపీఎస్ అధికారి, ఎంఎల్ఏ లాల్ దుహోమా జెడ్ పీఎమ్ కూటమిని స్థాపించారు. ఈ కూటమిలో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జొరామ్ నేషనలిస్ట్ పార్టీ, జొరామ్ ఎక్సోడస్ మూవ్ మెంట్, జొరామ్ డీసెంట్రలైజేషన్ ఫ్రంట్, జొరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ సభ్యులుగా ఉన్నాయి. తొలినాళ్లలో ఈ కూటమి సామాజిక సమస్యలపై పోరాడే వేదికగానే ప్రస్థానం ప్రారంభించింది. 2019లో ఈ కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ గుర్తింపునిచ్చింది. అనతికాలంలోనే అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి ప్రత్యామ్నాయం అనదగ్గ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంది.
నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు. వైట్ హౌస్ తో పాటు పెంటగాన్, అక్కడికి దగ్గర్లోని నావల్ బేస్ ల ఫొటోలను మంచి క్లారిటీతో తీసిందన్నారు. గ్వామ్, పెరల్ హార్బర్ సహా పలు కీలక ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను తీసి పంపించిందని చెప్పారు. సుప్రీం లీడర్ కిమ్ ను కోట్ చేస్తూ నార్త్ కొరియా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. కిందటి వారం నార్త్ కొరియా ఓ నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని, ఇప్పటికే తన పని మొదలు పెట్టిందని కిమ్ వెల్లడించారు. ఈ ఉపగ్రహంతో నార్త్ కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెడతామని పేర కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును పరిశీలిస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెడతామని చెప్పారు. నార్త్ కొరియా పంపించిన ఉపగ్రహం గురించి కానీ, దాని పనీతీరు గురించి కానీ బయటి ప్రపంచానికి ఎలాంటి వివరాలు తెలియవు. వాటితో పాటు ప్రస్తుతం ఆ శాటిలైట్ తీసినట్లు చెబుతున్న ఫొటోల వివరాలపైనా ప్రపంచ దేశాలకు ఎలాంటి స్పష్టత లేదు. శాటిలైట్ వివరాలు కానీ, అది తీసిన ఫొటోలు కానీ నార్త్ కొరియా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.
Read Also..
Read Also..
ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వేళ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి! 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం సరిహద్దులో తొలగించిన గస్తీ కేంద్రాలను ఉత్తర కొరియా పునరుద్ధరిస్తున్నట్లు సియోల్ ఆరోపించింది. సైన్యంతోపాటు భారీఎత్తున ఆయుధాలనూ మోహరించినట్లు పేర్కొంది. సైనిక ఘర్షణలను తగ్గించేందుకుగానూ 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు గతంలో తమ సరిహద్దుల్లో 11 చొప్పున ‘గార్డు పోస్ట్’లను తొలగించాయి. ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా 2018 నాటి ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపేస్తున్నట్లు దక్షిణ కొరియా ఇటీవల ప్రకటించింది. దీన్ని కనీస రక్షణ చర్యగా పేర్కొంటూ తమ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్లో ఎగురుతాయని తెలిపింది. దీన్ని ఉత్తర కొరియా తప్పుబట్టింది. ఇకపై ఆ ఒప్పందానికి తామూ కట్టుబడి ఉండబోమని తెలిపింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గస్తీ కేంద్రాల పునరుద్ధరణ, కందకాల నిర్మాణం వంటి పనులను గుర్తించినట్లు ద.కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఉత్తర కొరియా అక్కడ సైన్యాన్ని, భారీ ఆయుధాలను మోహరించినట్లు గుర్తించామని చెప్పింది. ఈ పరిణామాల నడుమ సరిహద్దుల్లో ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దృఢమైన సంసిద్ధతను కొనసాగించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దీన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నాయి.
చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు. చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని, కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి డా. ఎస్కే కాబ్రా భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో నిమోనియా తరహా శ్వాసకోశ వ్యాధి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న విషయం తెలిసిందే. ఇది కరోనా సంక్షోభం లాంటి పరిస్థితికి దారి తీస్తుందన్న ఆందోళన నడుమ డా.ఎస్కే కాబ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్, నవంబర్ కాలంలో చైనాలో అకస్మాత్తుగా చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి కేసులు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ కేసుల్లో మైకోప్లాస్మా కనిపించింది కానీ కొత్త, అసాధారణ వైరస్లు ఏవీ బయటపడలేదు. కొత్త వ్యాధికారక జీవి వచ్చిందనేందుకు సంకేతాలేవీ లేవు. మరో కొవిడ్ తరహా సంక్షోభం వస్తుందని చెప్పేందుకు ప్రస్తుతం అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చలికాలంలో కనిపించే సాధారణ వైరస్‌లే చైనా కేసుల్లో బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోపీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్ కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్ పై సంతకాలు కాలేదు. ఈ మెగా టోర్నీకి తామే ఆతిథ్యమిస్తామని చెబుతున్న పాక్. టీమిండియా కనుక టోర్నీలో పాల్గొనకుంటే పరిహారం చెల్లించాల్సిందేనని ఐసీసీని డిమాండ్ చేస్తోంది. సెక్యూరిటీ పరంగా వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఓ కొత్త పరిష్కారాన్ని సూచిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల సెక్యూరిటీ బాధ్యతలు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని, పాక్ పోలీసులు సహకరిస్తారని తెలిపింది. పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే భారత జట్టు టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో పాక్ వెళ్లేందుకు ఆటగాళ్లు ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ కూడా టీమిండియాను పాక్ కు పంపే విషయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. గతంలో పాక్ ఆసియా కప్ టోర్నీ నిర్వహించగా. టీమిండియా పాక్ వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఈసారి మాత్రం అలాంటి ప్రత్యామ్నాయానికి అంగీకరించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదని సమాచారం. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్ కు రాకుంటే ఐసీసీ తమకు పరిహారం చెల్లించాల్సిందేనని పీసీబీ కోరుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిన్న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని హమాస్ విడిచిపెట్టింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలు దేశానికి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారికి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. ఒప్పందంలో లేకున్నా 10 మంది థాయ్ జాతీయులు, ఒక ఫిలిప్పీన్స్ దేశస్థుడిని హమాస్ విడిచిపెట్టింది. దీంతో మొత్తం 24 మందికి హమాస్ స్వేచ్ఛ ప్రసాదించినట్టు అయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఖతర్ బందీల విడుదలను నిర్ధారించింది. రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా బందీల విడుదల సజావుగా సాగింది. హమాస్ చెర నుంచి బందీలు తిరిగి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, కాల్పుల విరమణ నేపథ్యంలో గాజాకు మానవతా సాయం అందింది. నాలుగు ఇంధన ట్యాంకర్లు, వంటగ్యాస్‌తో మరో నాలుగు ట్యాంకర్లు గాజాలోకి ప్రవేశించాయి. రోజుకు 150 ట్రక్కుల అత్యవసర సామగ్రి కూడా ఈ నాలుగు రోజుల్లో గాజాకు అందనుంది.
అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు. నయాగరా జలపాతం సమీపంలోని రెయిన్ బ్రిడ్జి వద్ద ఓ కారులో పేలుడు చోటుచేసుకున్నది. పేలుడు దాటికి కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయింది. కారు బాంబు దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే ఈ బ్రిడ్జి రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు. నయాగరా జలపాతానికి పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న మరో మూడు బ్రిడ్జిలను కూడా బంద్ చేశారు. యూఎస్-కెనడా సరిహద్దును దాటుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించిందని నయాగరా ఫాల్స్ మేయర్ కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాలను అనుసంధానం చేసే సరిహద్దు వంతెనకు సంబంధించిన విషయం కావడంతో ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజమ్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నదని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. అయితే ఈ పేలుడు వెనుక ఎలాంటి ఉగ్రవాద చర్య లేదని తెలుస్తున్నదని వెల్లడించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
Read Also..
Read Also..





Total views : 74846