కేసీఆర్ ఫాంహౌస్ భూముల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. సీలింగ్ చట్టం ప్రకారం పరిమితికి మించి భూములు ఉన్నట్లు విచారణలో తేలితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
స్వాధీనం చేసుకున్న భూములను నిరుపేద దళితులకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతంలో కేసీఆర్ ఫాంహౌస్ ముందు దళితులు ధర్నా చేసిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. దళితులను గత ప్రభుత్వం అవమానించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ.. అదే దళితులకు భూములు పంచుతామని వ్యాఖ్యానించారు.
ఫాంహౌస్ భూములపై విచారణలో ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీలింగ్ చట్టం ప్రకారం ఎంత భూమి అదనంగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది? భూములు స్వాధీనం చేసుకుంటే వాటిని నిరుపేద దళితులకు పంపిణీ చేస్తారా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ ప్రకటనపై బీఆర్‌ఎస్ స్పందన కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.