తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లు కురిశాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రాళ్ల వానపడింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, దోమకొండ ప్రాంతాల్లో వర్షం కురువడంతో పంట నష్టం జరిగింది. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల కోతకు వచ్చిన వరిపంటకు నష్టం కలిగింది. వరికల్లాల వద్ద ఆరబోయిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
అలాగే, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ వర్షం కురిసింది. రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగుపడింది. తాడి చెట్టు మంటల్లో కాలిపోయింది. ఆకాశం నుంచి నిప్పులు కురిసినట్టుగా పిడుగు పడటంతో తాడి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అలాగే, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. అలాగే, హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. రాబోయే అరగంట సమయంలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎండలు దంచికొట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల విలేజ్, షాపూర్ నగర్, సూరారం మరియు గండి మైసమ్మ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు చింతల్, పద్మనగర్ ఏరియాల్లో గాలివాన తీవ్రతకు భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకొరిగాయి. చెట్లు విరిగిపడటంతో రెండు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలపై చెట్లు పడటంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఆయా ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.




Total views : 81441