Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Political డీలిమిటేషన్ పై వైఖరి వెల్లడించిన టీవీకే అధినేత విజయ్..

డీలిమిటేషన్ పై వైఖరి వెల్లడించిన టీవీకే అధినేత విజయ్..

by CVR NEWS

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ బిల్లు, 2026ను కేంద్రం చర్చకు తీసుకురావచ్చని విజయ్ పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును స్వాగతిస్తున్నామని, అయితే దానికంటే ముందు డీలిమిటేషన్ బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను పునర్విభజిస్తే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోతుందన్నారు. దీనికి విరుద్ధంగా, అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరిగిపోతుందన్నారు విజయ్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని…దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గొంతు బలహీనపడి, భాష, సంస్కృతి, రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలపై తగినంత శ్రద్ధ లభించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రజల ఆకాంక్షలు, సమస్యలు పార్లమెంటులో సరిగ్గా వినిపించని దుస్థితి ఏర్పడుతుందని, ఇది వివక్షాపూరిత చర్యేనని ఆయన అభివర్ణించారు. ఈ సవరణ కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే కాకుండా, కేంద్ర నిధుల కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విజయ్ హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి సరైన ప్రాజెక్టులు, నిధులు కేటాయించడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ఆధారంగా సీట్లను, నిధులను పంపిణీ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు మరింత ఆర్థికంగా నష్టపోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించిన రాష్ట్రాలను శిక్షించి, పాటించని రాష్ట్రాలకు బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను పునఃపరిశీలించి, ఈ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని విజయ్ డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014082
Total views : 78925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.