Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News పార్లమెంట్‌లో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల దుమారం..

పార్లమెంట్‌లో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల దుమారం..

by CVR NEWS

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాడు అత్యంత దారుణంగా ఏపీ, తెలంగాణను విభజించిందని..ఆ విభజన బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు తేజస్వి సూర్య. విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీ తేజస్వి కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని, అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. తేజస్వి చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపీ ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

మరోవైపు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను, రక్తపాతంతో కూడిన విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను సహించే ప్రసక్తే లేదన్నారు.

అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు. తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కావాలనే రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తేజస్వి సూర్య ఉద్దేశం తెలంగాణను కించపరచడం కాదని ఆయన స్పష్టం చేశారు. విభజన సమయంలో చోటుచేసుకున్న అశాస్త్రీయ పరిణామాలను మాత్రమే తేజస్వి ప్రస్తావించారని.. దానిని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని.. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు కనీసం ఇద్దరు సభ్యులు కూడా లేరని, కేవలం తమ పార్టీ మద్దతుతోనే బిల్లు పాస్ అయిందన్న నిజాన్ని గ్రహించాలని గుర్తు చేశారు. ఇక తెలంగాణను ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎన్నోసార్లు యూటర్న్‌లు తీసుకుందని, ఆ పార్టీ ద్వంద్వ వైఖరి వల్లే ఉద్యమం సుదీర్ఘకాలం సాగిందని రాంచందరర్ రావు ఆరోపించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: