Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home International హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం..

హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం..

by CVR NEWS

హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ పరిణామం ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా చైనా, భారత్‌లకు పెను సవాళ్లు విసురుతోంది.

హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్‌లోని కీలక ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10 వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని అమెరికా మోహరించింది. ఈ బలగాలతోనే ఇరాన్ ఓడరేవులకు వెళ్లి, వచ్చే నౌకలను అడ్డుకుంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్ల స్థాయిలో ఉండేది.

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా అడ్డుకోవడంతో ఆ ప్రభావం భారత్, చైనాలపై పడుతోంది. ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశం చైనా. తాజా దిగ్బంధనం వల్ల చైనాకు అందే 1.8 మిలియన్ బ్యారెల్స్ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనిపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, అమెరికా చర్యను బాధ్యతారాహిత్యంగా పేర్కొంది. ఇక భారత్ నేరుగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకోక పోయినప్పటికీ, ఇతర మార్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

భారత్‌కు అవసరమైన గ్యాస్ ఎక్కువ భాగం ఈ జలసంధి ద్వారానే వస్తుంది. సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రభుత్వం ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లపై రేషనింగ్ విధించడమే కాకుండా డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ గడువును కూడా పెంచింది. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతోంది. ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు, ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గల్ఫ్ దేశాల్లో సుమారు 80-90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే, భారత్‌కు వచ్చే100 బిలియన్ డాలర్ల వార్షిక విదేశీ నగదు తగ్గిపోయే ప్రమాదం ఉంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ రవాణా అవుతుంది. అమెరికా కేవలం ఇరాన్ నౌకలనే లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఫ్రైట్ ఛార్జీలు పెరగడం వల్ల అన్ని దేశాలకు నష్టం తప్పడం లేదు. శాంతి చర్చలు మళ్ళీ ప్రారంభమైతేనే మార్కెట్లు స్థిరపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014989
Total views : 81438

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.