పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రెండ్రోజుల్లో ఈ సంప్రదింపులు జరగొచ్చని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి సంప్రదింపుల్లో ఇరు దేశాల తరఫున ఎవరెవరు పాల్గొంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు- ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హర్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని తెలిపింది. ఇదిలా ఉంటే..హర్మూజ్ దిగ్బంధంపై అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది చైనా. ఇరాన్‌తో తమకున్న సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.





Total views : 81448