Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News అమెరికా-ఇరాన్‌ మధ్య చర్యలు విఫలం కావడంపై ఆందోళన..

అమెరికా-ఇరాన్‌ మధ్య చర్యలు విఫలం కావడంపై ఆందోళన..

by CVR NEWS

పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఈ సారి గనక మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే.. కచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్‌ విషయంలో తమ తదుపరి ప్రణాళికల గురించి.. సోషల్‌ మీడియాలో పరోక్షంగా ప్రస్తావించిన ట్రంప్‌… ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే తన దగ్గరున్న ఏకైక అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే అని చెప్పారు. ఇరాన్‌ నౌకలను కదలనీయకుండా చేసి… ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ట్రంప్‌ వ్యూహంగా కనిపిస్తున్నట్లు అమెరికన్‌ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వెనెజువెలా విషయంలోనూ ట్రంప్‌ ఇదే ఫార్ములాను వాడి సక్సెస్‌ అయ్యారు. అందువల్ల ఇరాన్‌ మీద కూడా అదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో… ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడే సూచనలున్నాయి. ఇప్పటికే ఆ దేశ వైమానిక దళాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన అమెరికా.. ఈ సారి చమురు కేంద్రాలతో పాటు.. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అటు ఇరాన్‌ కూడా అంతే గట్టిగా ప్రతిఘటించే పరిస్థితులున్నాయి.

ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవచ్చు. అదే జరిగితే.. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్‌ వంటి గల్ఫ్‌ దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ దేశాలన్నీ ఇరాన్‌ దాడులతో తీవ్రంగా నష్టపోయాయి. ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లిన దేశాలు.. నేడు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నాయి. టూరిస్టులు లేక బోసిపోతున్నాయి. దీంతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది. అలాగే అటు ఇజ్రాయెల్‌తో ఇప్పటికే కయ్యం పెట్టుకున్న లెబనాన్ కు ఇప్పటికే యుద్ధం విస్తరించింది. , సిరియాకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికాస్థావరాలు, చమురు కేంద్రాలపై కూడా మళ్లీ ఇరాన్ దాడులను ముమ్మరంచేసే అవకాశాలున్నాయి..

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలోనూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది. లెబనాన్ టార్గెట్ గా వైమానిక దాడులకు దిగింది. ఈ కారణంగానే ఇరుదేశాల శాంతి చర్చలు విఫలమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్ యురేనియం నిల్వలు కొల్లగొట్టాలనే సంకల్పంతో యుద్ధాన్ని ఎగదోసిన అమెరికా వ్యూహాన్ని..తనకు అనుకూలంగా ఇజ్రాయిల్ మార్చుకోవడంతో ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యుద్ధం నుంచి వైదొలగలేక..కొనసాగించలేక..పాకిస్థాన్ ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు…ట్రంప్ ఇంటా బయటా అభాసుపాలుకాక తప్పలేదు..ప్రపంచాన్ని సైనికంగా శాసించగలిగే సత్తా ఉన్న అమెరికా ఇరాన్ వ్యూహాన్ని నిలువరించడంలో వైఫల్యం చెందిందనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇంకా అగ్రరాజ్యమనే దురహంకారం నుంచి ట్రంప్ మాత్రం బయటపడడం లేదు..ఇరాన్ పై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. యుద్ధం మొదలు పెట్టింది అమెరికా అయినా…ముగించేది తామేనంటోంది ఇరాన్. తమ ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిఘటినా యుద్ధాన్ని కొనసాగిస్తోంది…పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి దరిదాపుల్లో లేదని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడి చేసి 300 మందికి పైగా పౌరులను చంపింది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ చర్చలకు 15 రోజుల డెడ్‌లైన్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టింది. ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రాతిపదికన ఈ గడువును విధించింది. 15 రోజుల డెడ్‌లైన్ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22న ముగియనుంది. అప్పట్లోగా అమెరికా – ఇరాన్‌లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది. కానీ.. పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతిచర్చలు విఫలం కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది. దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

Advertisements

You may also like

Our Visitor

014995
Total views : 81448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.