Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Latest News సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన ఇరు దేశాలు..

సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన ఇరు దేశాలు..

by CVR NEWS

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం తాత్కాలికంగా చల్లబడింది. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి. ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను తగ్గించింది. అయితే, ఇరాన్ తక్షణమే హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు సురక్షితంగా తెరవాలనే షరతుకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీనిని ఇరుపక్షాల కాల్పుల విరమణగా ఆయన అభివర్ణించారు.

ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందు, ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేయడం ప్రపంచదేశాల్లో ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఇరాన్ నుంచి వచ్చిన 10 సూత్రాల ప్రతిపాదన చర్చలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్రంప్ పేర్కొనడంతో వాతావరణం మారింది.

అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ధ్రువీకరించబడింది. సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ.. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమలులో ఉండనున్న 14 రోజులు హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తునట్టు ప్రకటించారు.

మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్‌పై భారత్ రియాక్ట్ అయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం దౌత్యపరమైన చర్చలు అవసరమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఈ సంఘర్షణ ప్రపంచ దేశాలకు, ప్రజలకు ఇప్పటికే ఎంతో ఇబ్బందికర పరిణామాలను కలిగించిందని..ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపించాయని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా యుద్ధ విరమణ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్‌ను సమూలంగా దెబ్బతీస్తానని ప్రకటించి, మధ్యలోనే యుద్ధ విరమణకు అంగీకరించడంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది చారిత్రక తప్పిదమంటూ అక్కడి ప్రతిపక్షాలు, రక్షణ రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ ఒప్పందం ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. ఇరాన్‌పై పూర్తిస్థాయి విజయం సాధించకుండానే వెనక్కి తగ్గడం, ఓటమిని అంగీకరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విరామ సమయాన్ని ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను పునరుద్ధరించుకోవడానికి వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్లే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల ఇజ్రాయెల్ స్వతంత్ర రక్షణ విధానం దెబ్బతిన్నదని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒప్పందం నుంచి హెజ్బుల్లాను మినహాయించినప్పటికీ, ఇరాన్‌కు ఊరటనివ్వడం వల్ల ప్రాంతీయంగా ముప్పు తొలగిపోదని స్పష్టం చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: