అది శత్రువుల అడ్డా.. చుట్టూ గస్తీ కాస్తున్న ఇరాన్ బలగాలు. సరిగ్గా అదే సమయంలో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన, అత్యాధునిక విమానం అక్కడ చిక్కుకుపోయింది. దాని విలువ అక్షరాలా 931 కోట్ల రూపాయలు. కానీ, అమెరికా మాత్రం ఆ విమానాన్ని క్షేమంగా వెనక్కి తెచ్చుకోలేమని అర్థం కాగానే.. కనురెప్ప కాలంలో దానిని బాంబులతో పేల్చివేసింది. భారీ ఆర్థిక నష్టాన్ని భరించి మరీ అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అసలు ఇరాన్ ఎడారిలో ఏం జరిగింది?
ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ ఫైటర్ పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం ఒక రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఈ మిషన్‌లో భాగంగా వెళ్లిన విమానాల్లో ఒకటి సాంకేతిక లోపంతో ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. పైలట్‌ను రక్షించడం ఒక ఎత్తయితే.. ఆ విమానాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడం అమెరికాకు మరో సవాలుగా మారింది. ఎందుకంటే అందులో ఉన్నాయి సామాన్యమైన పరికరాలు కావు.. ప్రపంచం చూడని అత్యంత రహస్య యుద్ధ సాంకేతికత.
ఆ విమానంలో అమెరికాకు చెందిన అత్యాధునిక సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకవేళ ఈ విమానం ఇరాన్ సైన్యం చేతికి చిక్కితే.. అమెరికా సైనిక రహస్యాలు బహిర్గతమవుతాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించి శత్రు దేశాలు అమెరికా రక్షణ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే, 900 కోట్ల రూపాయల ఆస్తి పోయినా పర్వాలేదు కానీ.. దేశ భద్రత పణంగా పెట్టకూడదని అగ్రరాజ్యం భావించింది. వెనుకా ముందు ఆలోచించకుండా విమానాన్ని పేల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక 1980 నాటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. నాడు ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ వైఫల్యం చెందినప్పుడు, అమెరికా తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలేసి వచ్చింది. అది అప్పట్లో అమెరికా ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ఈసారి అలాంటి పొరపాటుకు తావివ్వకూడదని భావించిన కమాండోలు.. పైలట్‌ను సురక్షితంగా రక్షించడమే కాకుండా, శత్రువులకు ఒక్క సాంకేతిక పరికరం కూడా దక్కకుండా విమానాన్ని నామరూపాల్లేకుండా చేశారు.
ప్రస్తుతం ఇరాన్ ఆ విమాన శకలాల ఫోటోలను చూపిస్తూ.. అమెరికా ఆపరేషన్ విఫలమైందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కానీ రక్షణ రంగ నిపుణులు మాత్రం అమెరికా చర్యను సమర్థిస్తున్నారు. వందల కోట్ల డబ్బు కంటే దేశ రక్షణ రహస్యాలే ముఖ్యమని అమెరికా చాటిచెప్పింది. శత్రువులకు చిక్కడం కంటే.. సర్వనాశనం అవ్వడమే మేలని నిరూపించింది. ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లయింది.



Total views : 47762