అల్లూరి జిల్లా చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు , జి మాడుగుల పాడేరు మండలాల్లో గిరిజనులు ఇటుకుల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.దీనినే విత్తనాలు పండుగ అని కూడా గిరిజనులు చెప్పుకుంటారు. కొన్ని ఏళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెల ఆఖరి నుంచి ఏప్రిల్ 10వ తేదీ లోపు 15 రోజులు పాటు చాలా ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ముందుగా ఈ పండుగ మొదటిరోజు కొత్తకుండ తో కొండ మీద ఉన్నటువంటి ఊట నీరు తెచ్చి ఆ ఊట నీరుతో బోనాలు వండి గ్రామ దేవత శంఖు దేవుని కి బోనాలు పెట్టి పూజిస్తారు . తమ పనిముట్లను, ఆయుధాలను శంఖు దేవుని ముందు పెడతారు . పండుగ మొదటి రోజు సాయంత్రం కోడి గుడ్డును బాణాలతో కొట్టడం వీళ్ళ ఆచారం. బాణం తో కోడిగుడ్డు కొట్టిన వాళ్ళను గ్రామస్థులంతా కలసి సన్మానిస్తారు. బాణం తో గుడ్డు కొట్టని వారిపై బురద నీళ్లు, పేడ నీళ్లు ఆడవారు మగవారిపై పోస్తారు . ఆ తర్వాత రోజు నుంచి అడవులకు వేటకు వెళ్లి ఏదైనా జంతువు లేదా పక్షినైన వేటాడుతారు ఆ వేట మాంసాన్ని గ్రామస్తులంతా సమానంగా పంచుకొని విందు ఏర్పాటు చేసుకొని తింటారు. ఒకవేళ వేటకు వెళ్ళిన వాళ్ళు ఏ జంతువును కూడా వేటాడుకుంటా గ్రామానికి తిరిగి వస్తే, గ్రామంలో ఆడవాళ్లు అందరూ కలిసి పేడ నీళ్లు, బురద నీళ్లు, మగవారిపై పోయడం వీళ్ళ ఆచారం .
అలాగే ఈ పండుగ రోజులు ఎవరైనా గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్లినట్లయితే వారికి జరిమానా వేస్తారు. ఈ పండుగ పూర్తి అయ్యేవరకు సాయంత్రం వేళల్లో డప్పులు, వాయుధ్యాలతో,దింసా నృత్యాలతో చాలా సంతోషంగా గడుపుతారు, ఆడవాళ్లు అందరూ కలిసి వారం రోజులపాటు రోడ్లకు అడ్డంగా వెదురు కర్రతో కానీ తాడుతో గాని ఒక గేటును ఏర్పాటు చేసి రోడ్లమీద తిరిగే ప్రయాణికులను ఆపి వారి వద్ద నుంచి భరణం పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. భరణం డబ్బులు ఇచ్చిన వాళ్లకు తమ గ్రామ దేవత శంఖు దేవుని దగ్గర పూజించినటువంటి పసుపు, కుంకుమతో వాళ్లకు బొట్టు పెట్టి, వాహనాలకు కూడా బొట్టులు పెడతారు. డబ్బులు ఇవ్వని వారిపై రంగు నీళ్లు, బురద నీళ్లు, పేడ నీళ్లు జల్లుతారు. పండుగ చివరి రోజున వారం రోజులు నుంచి వసూలు చేసిన డబ్బులతో పిండి వంటలు వండి తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ దేవత శంఖు దేవుని పూజించి,తమ ఇళ్లల్లో ఆటకల మీద దాచినటువంటి విత్తనాలు పొలాల్లోచల్లుతారు .ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకొని ఈ పండుగను ముగిస్తారు.మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు .





Total views : 47771