ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఆకాశం నుంచి పడుతున్న నిప్పు కణాలు సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుల ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ప్రకృతి ప్రకోపం ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. గత రెండు మూడు రోజులుగా ఏపీని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం అన్నదాతల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. కేవలం రెండు రోజుల్లోనే పిడుగుపాటుకు గురై 9 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పొలం పనులకు వెళ్లిన వారు, బయట ఉన్న వారు పిడుగుల బారిన పడి ప్రాణాలు విడిచారు. పుల్లలచెరువులో పిడుగు పడిన ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పని చేస్తున్న ఇనముల నర్సమ్మ అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. అంతకుముందు ఆదివారం కూడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులకు వెళ్లిన తల్లి కూతుళ్లు విగతజీవులుగా మారడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వరుస మరణాలతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి త తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. వాతావరణం అనుకూలించని సమయంలో చెట్ల కిందకు, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లవద్దని.. రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.




Total views : 47777