రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు(కార్బొనేటడ్ డ్రింక్స్) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని కింగ్స్ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్ష సారాయి(వైన్), బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు. ”మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం. యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ, వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి” అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్ బాట్లెట్ తెలిపారు. తీసుకునే ఆహారానికి, దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు. అయితే, కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా.. వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్ రీసెర్చి కౌన్సిల్‌కు చెందిన డా.గ్లెనిస్ జోన్స్ తెలిపారు. యాపిల్‌తోపాటు పాలు, జున్ను తీసుకోవడం, ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు.
రోజుకో యాపిల్ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు
90
previous post