భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన ఎయిర్‌డ్రాప్ టెస్ట్‌లో పారాచూట్లు అనుకున్న విధంగానే పనిచేశాయి. డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించి విజయవంతంగా నేలకు చేర్చాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రూ క్యాప్సూల్‌ను సముద్రంలో సురక్షితంగా దించేందుకు ఈ 10 పారాచూట్ల వ్యవస్థ అత్యంత కీలకమని ఇస్రో తెలిపింది. ఈ విజయంతో గగన్‌యాన్ మిషన్ సిద్ధతలో మరో కీలక ముందడుగు పడింది.
National
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వస్తున్న వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో సీఎం విజయ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నై ఎగ్మూర్‌లోని ప్రముఖ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి, ICHలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి స్వయంగా వార్డుల్లోకి నడుచుకుంటూ రావడంతో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆస్పత్రిలోని ప్రతి వార్డును పరిశీలించిన సీఎం విజయ్.. అక్కడ అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై రోగులను, వారి కుటుంబ సభ్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇస్తున్నారా? ఎవరైనా లంచాలు అడుగుతున్నారా? అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న చిన్నారి శిశువులను ఎత్తుకుని ముద్దాడిన సీఎం, బాలింతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రి ఆవరణలో, వార్డుల పరిసరాల్లో అపరిశుభ్రత చూసి సీఎం విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఉండే హాస్పిటల్‌ను ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతారా అంటూ అక్కడున్న ఉన్నతాధికారులపై, శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాధ్యతని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగంలో జవాబుదారీతనం పెంచేందుకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ముందస్తు నోటీసులు లేకుండా తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు. సీఎం తాజా చర్యతో తమిళనాడులోని ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించింది. పౌరుల భద్రతతో పాటు ఇంధన సరఫరా, వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరింది. శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ చర్చలు, దౌత్య మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపునిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ దాదాపు ముగిసిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే అమెరికా తాజా దాడులు చేపట్టిందని తెలిపారు. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు శాతానికి పైగా పెరిగాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ కూడా వెల్లడించింది.
భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది. వీటికి అదనంగా తెల్లటి నుక్రా జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా అవతరించబోతుండటం ఆసక్తికరం.
నుక్రా త్వరలో ఒక ప్రత్యేక దేశీయ జాతిగా అధికారిక గుర్తింపు పొందనుందని రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. నుక్రా గుర్రంపై మొట్టమొదటి శాస్త్రీయ సర్వే, డాక్యుమెంటేషన్‌ను మొదలైందని, దీనికి ఆమోదం పొందితే, భారతదేశపు తొమ్మిదవ అధికారికంగా గుర్తింపు పొందిన గుర్రపు జాతిగా నుక్రా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. నుక్రాను ఒక ప్రత్యేక గుర్రపు జాతిగా గుర్తించడం జరిగితే ఈ జాతి గుర్రాల అభివృద్ది, సంరక్షణకు తోడ్పడుతుందని, ప్రభుత్వ పరంగాకూడా శాస్త్రీయ పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు. గుర్రాలను పెంచే యజమానులకు నుక్రా జాతి గుర్రాల పెంపకంతో మంచి ధరలు పొందవచ్చని అధికారులు అంటున్నారు.
నుక్రా గుర్రం దాని మెరిసే తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, పెదవులు, దృఢమైన శరీరం, ప్రశాంతమైన స్వభావంతో ప్రత్యేకంగా ఉంటుందని అధికారులు వివరించారు. సుమారు 160 నుండి 170 సెంటీమీటర్ల ఉండే నుక్రా జాతి గుర్రం, దాని ఓర్పు, చురుకైన నడక, పరుగు ఆకట్టుకునే రూపానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు. అరుదైన, పురాతన జాతి గుర్రం జాతులకు రాజస్థాన్ నెలవుగా కొనసాగుతుంది. బంగారు రంగు చర్మంతో మెరిసిపోయే మార్వారీ జాతి గుర్రం రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతమైన మార్వారీకి చెందిన ఒక అరుదైన, పురాతన జాతి గుర్రంగా గుర్తింపు పొందింది. దీని చెవులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఈ అశ్వం చాలా ఓర్పుతో ఉంటుంది. అలాగే స్వారీ చేసేవారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. దీంతో మార్వారీ జాతి గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బంగారు రంగు గుర్రాలు సాధారణంగా తుర్క్మెనిస్థాన్లో కనిపిస్తాయి. వాటిని పలోమినో అని పిలుస్తారు. వాటి లక్షణాలతో ఉండే మార్వారీ జాతి గుర్రాలు రాజస్థాన్ లో కూడా మనుగడ సాగిస్తున్నాయి.అశాస్త్రీయ పెంపకం పద్ధతుల కారణంగా 1930లలో ఈ జాతి అంతరించిపోయే దశకు చేరుకుంది. అయితే భారతీయ పెంపకందారులు, ప్రభుత్వం చొరవతో చేపట్టిన సమష్టి సంరక్షణ చర్యల వల్ల మార్వారీ జాతి గుర్రాలు సంఖ్య పెరిగింది.
మార్వారీ జాతి గుర్రాలు కఠినమైన పరిస్థితులున్న రాజస్థాన్ భూభాగం నుంచి వచ్చినందున అవి చాలా తక్కువ నీటితో జీవించగలవు. తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను తట్టుకోగలవు. అలసిపోకుండా ఎక్కువ దూరం ఎడారిలో ప్రయాణించగలవు. ఈ గుర్రాల నడకను సవారీదారులు ఎంతో విలువైనదిగా భావిస్తారు. వాస్తవానికి మార్వారీ అశ్వాలను యుద్ధ గుర్రాలుగా పరిగణిస్తారు. మార్వారీ గుర్రాలు ధైర్యం, తెలివితేటలు, ఓర్పునకు ప్రసిద్ధి చెందాయి. అలాగే వీటిని పవిత్రమైనవిగా భావించి ఉన్నత హోదాకు, రాజరికానికి ప్రతీకలుగా పరిగణించేవారు.
మార్వారీ జాతి గుర్రాలు గుజరాత్‌లోని కతియావార్ ద్వీపకల్పానికి చెందిన కతియావారీ జాతికి అశ్వాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. కతియావారీ జాతి గుర్రాలకు కూడా చెవులు లోపలికి వంగి ఉంటాయి. ఈ చెవులు అత్యుత్తమ వినికిడి శక్తి కోసం రాడార్లా పనిచేస్తాయి. తీవ్రమైన ఎడారి ఇసుక తుపానుల నుంచి కూడా ఈ చెవులతో బయటపడగలవని నమ్ముతారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా గుడియా గ్రామంలోని మార్వారీ జాతికి చెందిన అరుదైన బంగారు వర్ణపు గుర్రం ఒకటి ఇటీవల భారీ ధరకు అమ్ముడైంది. గోల్డెన్ కింగ్‌గా పేరొందిన ఈ అశ్వం ఏకంగా 70 లక్షల రికార్డ్ ధరకు సేల్ అవ్వడం గమనార్హం.
మార్వారీ జాతీ గుర్రం కంటే మెరుగైన లక్షణాలతో ఇప్పుడు కొత్తగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం నుక్రా జాతి గుర్రాలను అభివృద్ది చేసింది. నుక్రా జాతి గుర్రాలకు కేంద్రం నుంచి రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా గుర్తింపు దక్కితే..ఈ జాతి గుర్రాల పోషణ, జనాభా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏవియేషన్ రంగానికి చెందిన ‘కేర్‌వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’కు సంబంధించి జరుగుతున్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ సుదీర్ఘ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని ఐదు చోట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.ఈడీ ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీకి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 160 కోట్లను కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేశారు. ఆ తర్వాత 82.96 కోట్లను మరో కంపెనీకి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులతో 112 కోట్ల వ్యయంతో ఒక ఎంభ్రేయర్ లీగసీ 600 విమానం, ఒక అగస్టా 109 ఎస్పీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. వీటిని తిరిగి అధిక ధరకు టీఎంసీకే లీజుకు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ లావాదేవీల తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందని, అసలు లబ్ధిదారులను గుర్తించకుండా నిధుల మళ్లింపును దాచిపెట్టేందుకే ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ కొనుగోలుకు విదేశీ నిధులు ఏమైనా వినియోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న టీఎంసీకి, ఈ తాజా పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నిధుల మూలాలపై ఆ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు గతంలోనే పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. దీంతో ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ నుంచి నర్సింగ్‌పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
హైవే దెబ్బతిన్న వెంటనే జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, రహదారి కుంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గురుగ్రామ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయాయి. ఒకచోట గుంతలో ఎస్యూవీ వాహనం ముందు చక్రాలు ఇరుక్కుపోగా, జిల్లా కలెక్టర్ నివాసం, రాష్ట్ర మంత్రి నివాసం సమీపంలో కూడా రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కార్లు, బస్సులు, లారీలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్‌హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని నివారించాలని, రాజీవ్ చౌక్, సదర్న్ పెరిఫెరల్ రోడ్, హీరో హోండా చౌక్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు కొనసాగుతున్నాయని, ప్రజలు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వయనాడ్ – మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‘టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్’ సైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయ కంటైనర్లు, కార్మికుల బస్సులు, కార్లు, జేసీబీలు వంటి భారీ యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పనుల్లో ఉన్న సుమారు 30 నుంచి 50 మంది వరకు కార్మికులు మట్టి శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని రెస్క్యూ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురు కార్మికులను ప్రాణాలతో కాపాడగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదం పై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌తో పాటు కోజికోడ్ నుండి NDRF బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భారీ వృక్షాలు కూలిపోవడం, మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలోని చిన్న నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లతో పాటు హోమ్‌స్టేలు కూడా ఉండటంతో, వర్షాల సీజన్ కారణంగా ఎవరైనా పర్యాటకులు కూడా మట్టి శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ మేరకు జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ ఎస్జే దవేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2008 జులై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు మాత్రమే కాకుండా, మొదటి విడత పేలుళ్లలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ పేలుళ్లలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ క్రైమ్ బ్రాంచ్.. 100 మందికి పైగా నిందితులుగా పేర్కొంది. 78 మందిపై విచారణ జరిగింది. అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్ఐఆర్లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్ఐఆర్లతో కలిపి మొత్తం 35 కేసులను విలీనం చేసి సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ క్రమంలో 9 మంది వేర్వేరు న్యాయమూర్తుల ముందు 1,163 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. భద్రతా కారణాల దృష్ట్యా 26 మంది కీలక సాక్షుల పేర్లను గోప్యంగా ఉంచారు.
గుజరాత్ హైకోర్టు హైకోర్టుకు చేరిన ఈ కేసులో గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. దీంతో నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన చార్జీలను న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఇవాళ తుది తీర్పు వెలువరించింది. అయితే దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో (38 మందికి) ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి.
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని జనతానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఐతే రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో..విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఇక ముంబైలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల చెట్లు కూలడంతో కొందరు మృత్యువాత పడ్డారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు రద్దు చేశారు, మరికొన్ని దారి మళ్లించారు. ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు అధికారులు. అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. థానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీంతో దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో, దాదాపు 79 వేల 450 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు.
వార్షికంగా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రిఫైనరీని రూపొందించారు. ఇది పశ్చిమ రాజస్థాన్‌లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేవలం రిఫైనరీనే కాకుండా రాజస్థాన్‌లో దాదాపు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 13,000 కోట్ల జైపూర్ మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన, రూ. 480 కోట్లతో నిర్మించిన జోధ్‌పూర్ ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం, సవరించిన ‘ఉడాన్’ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ప్రారంభం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా, వేడుక వేదికగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన సుమారు 54,000 మంది అభ్యర్థులకు ప్రధాని నియామక పత్రాలను పంపిణీ చేశారు.






Total views : 197072