తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరచూ రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, మరియు వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో భారీగా దిగుబడులు వస్తున్న నేపథ్యంలో, రైతులకు ఇబ్బంది లేకుండా పంట కొనుగోళ్లు జరిగేలా మంత్రి సమీక్షించారు. అదనంగా మరో రూ.1,800 కోట్ల నిధులను కేటాయించి, మొత్తం రూ.5,800 కోట్లతో మొక్కజొన్న సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అనుకున్న సమయానికే రైతులకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని.. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను జూలై నెలాఖరులోపు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వచ్చే ఏడాది నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Political
నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది . పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుండగులను గుర్తించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు . ప్రజలు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అమెరికాతో ఇరాన్ ఒప్పందం ఇప్పట్లో కుదురుతుందా… ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్న. త్వరలోనే డీల్ ఓకే అవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటిస్తున్నప్పటికీ… అందరిలోనూ ఏదో తెలియని సందేహాలు. నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్లు ఉన్న ట్రంప్ వ్యవహారమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే గతంతో పోల్చితే… ఇరాన్- అమెరికా చర్చల ప్రక్రియలో కొంత పురోగతి ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. చాలా కాలంగా అమెరికా డిమాండ్ చేస్తున్నట్లుగా… తమ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడానికి మార్గం మరింత సుగమం అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించి.. హర్మూజ్‌ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారికంగా ఒప్పందం కుదరగానే యురేనియం నిర్వీర్యం చేసే విధానాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
వాస్తవానికి ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తలెత్తడానికి, అందులో అమెరికా జోక్యం చేసుకుని సమస్యను మరింత జఠిలం చేయడానికి ఈ యురేనియం నిల్వలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల ప్రకారం.. ఆ దేశం దగ్గర 60శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వ ఉంది. దీన్ని ఇరాన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరింత శుద్ధి చేసి అణ్వస్త్ర తయారీకి వినియోగించుకోవచ్చు. ఇదే భయంతో అమెరికా అణు నిరాయుధీకరణ డిమాండ్ చేసింది. దీనికి ఇరాన్ ససేమిరా అనడంతో.. సంక్షోభం తలెత్తింది. అది రానురానూ ముదిరి యుద్ధానికి దారి తీసింది. అయితే అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు రెండు దేశాలు చర్చల ప్రక్రియను కొనసాగిస్తుండడంతో… తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారాయి. ఇప్పుడు చర్చల్లో మరింత పురోగతి రావడం.. యురేనియం విషయంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గడంతో త్వరలోనే యుద్ధం ముగుస్తుందన్న ఆశలు బలపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారం వందశాతం అవాస్తవమని, కిట్ల పంపిణీని ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల కిట్ల సరఫరాలో సుమారు నెల రోజుల జాప్యం జరుగుతోందని తెలిపారు.
ప్రభుత్వం నిజాయతీగా జాప్యం గురించి వెల్లడిస్తే, దానిని వక్రీకరించి అసలు కిట్లే ఇవ్వరంటూ వైసీపీ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని విమర్శించారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో యూనిఫాం క్లాత్, బూట్లు, బ్యాగుల సరఫరా ఆలస్యమవుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపినట్లు లోకేష్ వివరించారు. అయితే, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కచ్చితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వస్తువులను కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు అధికారులు తయారీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లోకేష్ తెలిపారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి తెలంగాణకు 10 టీఎంసీల నీళ్లు అందిచాలని నిర్ణయించారు. ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం నుండి తెలంణకు 16 టీఎంసీల నీటిని కేటాయించారు. ఆగస్టు 15 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఇక ఎల్లుండి మరోసారి దీనిపై చర్చించేందుకు కేఆర్ ఎంబీ సమావేశం కానుంది.
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకేలోని సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం తమ మద్దతును ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు షణ్ముగం.
గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో మూడుసార్లు, గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “పార్టీని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని.. దాని భవిష్యత్తు గురించి చర్చించాలన్నారు. టీవీకేను అధికారంలోకి రాకుండా ఆపేందుకు, డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని షణ్ముగం స్పష్టం చేశారు.
53 ఏళ్లుగా మన రాజకీయాలు డీఎంకేకు విరుద్ధంగానే సాగాయన్న షణ్ముగం..డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మెజారిటీ వర్గం తిరస్కరించిందన్నారు. ఒకవేళ అలాంటి పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడే ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అన్నాడీఎంకేను చీల్చే ఉద్దేశం తనకు లేదన్న షణ్ముగం..పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ 5 సీట్లతో మద్దతివ్వగా, రెండు వామపక్ష పార్టీలు (4), వీసీకే (2) మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఈ పార్టీలన్నీ డీఎంకేకు దీర్ఘకాల మిత్రపక్షాలు కావడంతో ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. తాజాగా షణ్ముగం వర్గం మద్దతుతో విజయ్ సర్కారుకు రాజకీయంగా మరింత స్థిరత్వం లభించినట్లయింది.
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టన్నెల్స్‌లో ఐదు గ్యాంట్రీలతో జరుగుతున్న లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టన్నల్ లోపల 12 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎం మిషన్‌ను తొలగించేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని టీబీఎం మిషన్‌ను తీసివేసినట్లయితే నీరు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. టీబీఎం తొలగించకుండా, ఇంకా 3 వేల కోట్ల పనులు చేయాల్సి ఉన్నా వెలిగొండ ను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశాడని విమర్శించారు. టన్నెల్- 2 లోనే అధికారులు, కార్మికుల తో కలసి భోజనాలు చేశారు మంత్రి నిమ్మల.
ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ గా రాబోతున్న హీరో విజయ్ దేవరకొండ…
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది.
ఈ రోజు రిలీజ్ చేసిన వీడీ శౌర్యువ్ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి రావడం ఆసక్తి కలిగిస్తోంది. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.
నటీనటులు – విజయ్ దేవరకొండ, తదితరులు
ఏప్రిల్ 2026 నాటికి, రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సమీక్షించింది. ఒక నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు ఇది అవసరమని హైకోర్టు భావించగా, దిగువ కోర్టు కేసు నమోదు చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
()ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని, లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు నివేదించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ ఎస్. విఘ్నేష్ శిశిర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో, ఈ విషయంపై నివేదిక దాఖలు చేయడానికి 2026 మార్చి 24న కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.2026 మార్చి 19న, రాహుల్ గాంధీ జాతీయతపై ఆయనకు 2019లో పంపిన నోటీసుకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రహస్య రికార్డులను కోర్టు పరిశీలించింది. కాగా..2026 జనవరి 28న, లక్నో ఏసీజేఎం కోర్టు, తమకు అధికార పరిధి లేదని ఇది ప్రక్రియ దుర్వినియోగం అని పేర్కొంటూ, అదే పిటిషనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. బీజేపీ సభ్యుడైన పిటిషనర్, రాహుల్ గాంధీ బ్రిటిష్ జాతీయుడని పేర్కొంటూ, పౌరసత్వ చట్టం అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని కోరారు.
కాగా…కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కి ద్వంద్వ పౌరసత్వం ఉందని.. కొందరు బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీకి భారత పౌరసత్వంతోపాటు.. బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని పేర్కొంటున్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒకే దేశ పౌరసత్వం ఉండాలి. అయితే రాహుల్ గాంధీకి ఇటు భారత్‌తోపాటు, బ్రిటన్ పౌరసత్వం ఉందనే ఆరోపణలు పదే పదే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ విషయంలో దాఖలైన పిటిషన్‌పై కోర్టు స్పందన కోరగా.. కేంద్రం… ఆ అంశం పరిశీలనలో ఉందని తెలిపింది.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ బిల్లు, 2026ను కేంద్రం చర్చకు తీసుకురావచ్చని విజయ్ పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును స్వాగతిస్తున్నామని, అయితే దానికంటే ముందు డీలిమిటేషన్ బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను పునర్విభజిస్తే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోతుందన్నారు. దీనికి విరుద్ధంగా, అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరిగిపోతుందన్నారు విజయ్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని…దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గొంతు బలహీనపడి, భాష, సంస్కృతి, రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలపై తగినంత శ్రద్ధ లభించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రజల ఆకాంక్షలు, సమస్యలు పార్లమెంటులో సరిగ్గా వినిపించని దుస్థితి ఏర్పడుతుందని, ఇది వివక్షాపూరిత చర్యేనని ఆయన అభివర్ణించారు. ఈ సవరణ కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే కాకుండా, కేంద్ర నిధుల కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విజయ్ హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి సరైన ప్రాజెక్టులు, నిధులు కేటాయించడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ఆధారంగా సీట్లను, నిధులను పంపిణీ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు మరింత ఆర్థికంగా నష్టపోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించిన రాష్ట్రాలను శిక్షించి, పాటించని రాష్ట్రాలకు బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను పునఃపరిశీలించి, ఈ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని విజయ్ డిమాండ్ చేశారు.



Total views : 92044