ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వేడుకల ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.ఆ తర్వాత పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన చంద్రబాబు… ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు బలగాల సన్నద్ధతను సమీక్షించారు. పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్తో పాటు కర్ణాటక పోలీసు దళం నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు ప్రతీకగా, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఘనంగా సాగాయి
Andhra Pradesh
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు. కనేకల్ క్రాస్ వద్ద హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలంతో పాటు బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని అధికారులతో, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు.టాటా పవర్, వ్యారీస్, సుజలాన్ సంస్థలు సంయుక్తంగా దాదాపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల పత్తికొండలో టాటా పవర్ ఆధ్వర్యంలో చేపట్టిన 400 మెగావాట్ల ‘కనేకల్ వన్’ ప్రాజెక్టుకు నారా లోకేష్ వర్చువల్‌గా భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కనేకల్‌లో మరో 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.ఈ నెల 25న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు, బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన అద్భుతమైన స్టీల్ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి వద్ద శిలాఫలకం ఆవిష్కరించడమే కాదు.. స్వయంగా కాలినడకన వెళ్లి మరీ రోడ్లను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, పలువురు ప్రజాప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కూడా ఎదగాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. వారానికి మూడు రోజులు.. మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. దీంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపారం, విద్య, పర్యాటకం కోసం ప్రయాణించే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానించడమే లక్ష్యమన్నారు. మరోవైపు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్య సీ-ప్లేన్ ప్రాజెక్టుపై కూడా వ్యూహరచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆగస్టు చివరి నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేసి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టరేట్లో వెలిగొండ పనుల పురోగతి, నిర్వాసితుల పునరావాసం, ముంపు గ్రామాల తరలింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల కోసం ప్రకటించిన 900 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఇప్పటికే 318 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. సాగు, తాగునీటితో పాటు మార్కాపురాన్ని పారిశ్రామిక, హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించే అంశంపై అధికారులు, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ సహకారంతో సమగ్రమైన సిటిజన్ డేటాబేస్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించారు. కుటుంబాల అవసరాలు, అర్హతలను గుర్తించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత, సమర్థత తీసుకురావడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులు అవమానాలకు గురయ్యారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల త్యాగాలు, భూసమీకరణతోనే అమరావతి నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడిందని తెలిపారు. రాజధాని నిర్మాణం విషయంలో రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలిసి ప్రారంభించారు. సబ్ డిపో అందుబాటులోకి రావడంతో ఇకపై రేషన్ సరుకుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సబ్ డిపో లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని.. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సబ్ డిపో ప్రారంభంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులకు అధికారులు టాయిలెట్ల వినియోగం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రభుత్వ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశంలో ఒకప్పుడు గందరగోళ పరిస్థితి ఉండేదన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా.. మెజార్టీ ప్రజలు అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి ముందు తాను సింగపూర్ వెళ్లానని.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని తెలిపారు. ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ భవనాల డిజైన్లను కూడా సింగపూర్ రూపొందించిందన్నారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్ రాజధాని అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఆయన మండిపడ్డారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ ఎంఓయూపై ఒప్పందం జరిగింది. తీర రక్షణ గోడకు సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది. 323 కోట్లతో ప్రతిష్టాత్మక తీర రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనున్నాయి.సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం, తీర కోత తీవ్రతపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్మాణ డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. అధికారిక ఒప్పంద ప్రక్రియ పూర్తికావడంతో రానున్న నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు