నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి శాలువాతో సత్కరించారు. అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి పూజల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Devotional
తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ముఖ్యంగా సిఫార్సు లేఖలపై ఆధారపడి దర్శనానికి వచ్చే భక్తులు, ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
జులై నెలలో నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతరాయం కలగనుంది. తిరుమల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 14 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా, జులై 17ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా…వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. జులై 19 ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద కార్యక్రమం నేపథ్యంలో, జులై 29 జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
ఆగస్ట్ నెలలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్ 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా…. ఆగస్ట్ 24న పవిత్రాల సమర్పణ కార్యక్రమం ఉన్నందున వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు.
ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. దీంతో ఈ నెలలో ఎక్కువ రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8న బ్రహ్మోత్సవాల ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా…. సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా… సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందు రోజులలో, ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చి చెప్పింది. అయితే, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పర్వదినాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కావున, తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు తేదీలను జాగ్రత్తగా గమనించి, అనవసర ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. గ్రామస్తులు తమ తాతలు, ముత్తాతల కాలం నుంచే ఈ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.ప్రతి ఐదేళ్లకోసారి ఈ వేపచెట్టు వద్ద భారీ జాతర మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చెట్టు మధ్య భాగంలో కలువపువ్వు ఆకారాన్ని పోలిన నిర్మాణం ఉండటంతో దీనిని దైవచిహ్నంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మంగారు చెప్పిన సంకేతాలకు అనుగుణంగా ఈ చెట్టుకు కలువపువ్వు పూసిందని స్థానికులు చెబుతున్నారు.
అయితే గత రాత్రి వీచిన స్వల్ప ఈదురుగాలుల కారణంగా ఈ పురాతన వేపచెట్టు నేలవాలింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో రహదారి విస్తరణ పనుల సమయంలో చెట్టును తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, చెట్టును తాకిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని నమ్ముతున్న గ్రామస్తులు, దానిని యథాతథంగా ఉంచాలని అధికారులను కోరిన విషయం గుర్తుచేస్తున్నారు.ఇప్పుడు చెట్టు విరిగిపోవడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి గ్రామస్థుల విశ్వాసాలు మాత్రమేనని, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒక కోటి 11 లక్షల 96 వేల 170 లడ్డూలు, మే నెలలో 1 కోటి 21 లక్షల 35 వేల 528 లడ్డూలు, జూన్ నెలలో 1 కోటి 26 లక్షల 81 వేల 805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కాగా, 2024 జూన్ నెలలో 1కోటి 02 లక్షల 64 వేల 364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1 కోటి 19 లక్షల 21 వేల 353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1 కోటి 26 లక్షల 81 వేల 805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7 లక్షల 59 వేల 452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24 లక్షల 17 వేల 441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది.
హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్ లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ సభ్యులు, వివిధ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికాయి. అంతకుముందు, జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. భక్తులను స్వాగతించిన వారిలో డీఐజీ సర్గూన్ శుక్లా, రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ అలియాస్ ఖాన్, ఎస్ఎస్పీ అరుణ్ గుప్తా, ట్రాఫిక్ ఎస్ఎస్పీ రాజా ఆదిల్ హమీద్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. తర్వాత, భక్తులు బస చేసే మొదటి ప్రధాన కేంద్రం చందర్‌కోట్. పవిత్ర యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు, భోజన సదుపాయాలను సిద్ధం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ద్వారా రూ.2 కోట్ల 78 లక్షల 13 వేల 79 నగదు ఆలయానికి సమకూరినట్లు ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. అదనంగా 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 150 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు. కొండక్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంది. రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించింది. ఆలయంలో నిందితులు చోరీకి ఎలా పాల్పడ్డారు. ఈ దోపిడీ వెనుక ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయాన్నే ఈ దొంగల ముఠా టార్గెట్ చేసుకుంది. కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఓ ముఠానే పనిచేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన 8 మంది నిందితులను సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం.. కానుకలు, విరాళాలు వెల్లువెత్తడంతో.. అదే అదనుగా కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. ఈ మొత్తం కుట్రలో లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. రాముడి సొమ్మును దొంగిలించి.. వీరు అరడజనుకు పైగా బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని వీరికి సంబంధించిన అరడజన్కు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తుకోసం అయోధ్య పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సిట్ పోలీసులు.. ఇప్పటివరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా సహా ఎనిమిది మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన తిన్ను యాదవ్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఇక రికవరీ సీన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో.. జూన్ 5న పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు. అక్కడ నాలుగు బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచిపెట్టిన ఏకంగా 89 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో, నాలుగు బాక్సులలోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితులైన అనుకల్ప్, లవకుశ్ దొంగిలించిన సొమ్ముతో ఫామ్‌హౌస్, రూ.65 లక్షల విలువైన ఇల్లు మరియు పలు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా, స్కార్పియో వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవనశైలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి. మరోవైపు ఆలయంలోని విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన కొంతమంది SBI సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామాలయంలోని నాలుగు డొనేషన్ బాక్సుల నగదును లెక్కించే బాధ్యతను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందిన 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్ట్‌కు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు.
మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పరిధిని పెంచుతూ యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్‌లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్ఐటీ స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు చేస్తున్న సిట్ గడువు ముగియడంతో..మరో మరో 15 రోజుల అదనపు గడువు పొడిగించింది.
ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పవిత్ర రథోత్సవం ఈ నెల 16న అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథిన ఈ రథయాత్ర ఘనంగా ప్రారంభమవుతుంది. జూలై 16 నుంచి 24 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కనులపండువగా సాగనున్నాయి. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల లీలా విశేషాలతో కూడిన ఈ పవిత్ర యాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పూరీలోని ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ రథ యాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య గుండిచా మందిరం వరకు సాగుతుంది. అక్కడ కొలువై ఉండే స్వామివారలు, ఉత్సవాల అనంతరం తిరిగి జూలై 24న బహుదా యాత్ర ద్వారా మళ్లీ ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఈ తొమ్మిది రోజుల సుదీర్ఘ రథోత్సవ వేడుకలు ముగుస్తాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లు చేస్తోంది. భక్తజన సంద్రంతో పూరీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఘాట్ రోడ్, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు నిర్ణయించిన మార్గంలో ఊరేగింపు సాగింది.మార్గమధ్యంలో స్థానిక మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి, హారతులు ఇస్తూ కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారికి స్వాగతం పలికారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు కుంకుమ, ప్రసాదాలను దేవస్థానం పంపిణీ చేసింది.వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు.
తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు. పద్మావతి దేవి ఉద్భవించిన పద్మ సరోవరంలో పాహి హరిప్రియ అలిమేలు మంగమ్మ కన్నుల పండువుగా ఐదు చుట్లు వూరేగి భక్తులకు అభయమిచ్చారు. ప్రతి యేట జ్యేష్ట మాసంలో 5 రోజుల పాటుగా అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి. అందులో భాగంగా నీటిపైన తేలియాడే తెప్పలలో అమ్మవారు రోజుకొక వాహనంలో కన్నుల పండుగా అమ్మవారిని వూరేగిస్తారు. సిరుల తల్లి అలిమేలుమంగమ్మ జలవిహారం మిరుమెట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీప అలంకరణలో సాగింది. అమ్మవారు అభయవరధహస్తాలతో భక్తులను కరునిస్తూ జలవిహారం సాగించారు.
శ్రీనివాసుని దేవేరి పద్మావతమ్మ దివ్య దర్శనానికి వేలాదిమందిగా భక్తులు తరలివచ్చారు.






Total views : 197083