భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న ఆరు బంగారు గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి రాత్రివేళ ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో మహిళల మెడలోని బంగారు గొలుసులను కట్ చేసి అపహరించినట్లు ఎస్పీ వివరించారు.
Crime
హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో మరింత సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి ముఠాకు కొందరు పోలీసు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై తెలంగాణ ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా నిందితులు పోలీసులపై దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీలోని పాడేరు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం కుటుంబాలతో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. బయటకు క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నట్లు చెబుతూ, 2022 నుంచి గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసేవారని దర్యాప్తులో తేలింది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, పాత ఎయిర్‌పోర్టు రోడ్డులో ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో పొట్లాలను ఉంచి, వినియోగదారులకు ఫొటోలు, లొకేషన్ పంపే పద్ధతిలో విక్రయాలు సాగించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ పోలీసులు డీఎస్పీలు నర్సింగరావు, రమేశ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు.నిందితులు ఇంటికి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారు.
పోలీసులు ఆవరణలోకి ప్రవేశించగానే నిందితులు కుక్కను ఉసిగొల్పినట్లు సమాచారం. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయమైంది. పోలీసులు అప్రమత్తమై ఇద్దరు నిందితులు దుర్గాప్రసాద్, కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే కిరణ్ మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ మల్లేశ్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి, పక్క భవనాలపైకి ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలి సెల్‌ఫోన్ తీసుకుని, ఓ అపార్టుమెంట్‌పైకి ఎక్కి పోలీసులతో వాదించినట్లు వెల్లడించారు.ఎట్టకేలకు అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ భార్య హారికను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల ఇంట్లో సోదాలు నిర్వహించగా 14.5 కిలోల గంజాయి, ఒక ఎయిర్‌గన్ లభించినట్లు ఈగల్ అధికారులు వెల్లడించారు. నిందితుల సెల్ఫోన్లను పరిశీలించగా 203 మంది వారి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిలో వంద మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 72 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
ఈ కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చాయి. బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లతో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈగల్ పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే నిందితుల ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో కొందరు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం. అక్కడ పోలీసు వైర్లెస్ పరికరానికి సంబంధించిన మ్యాన్‌ప్యాక్ భాగం లభించడం ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నిందితులతో కొందరు పోలీసు సిబ్బంది కుమ్మక్కై, తనిఖీలు లేదా దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే చేరవేసేవారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు 36 మంది ఉండగా.. గుంటూరుకు చెందిన ముగ్గురు.. శరణప్ప, లక్ష్మీదుర్గ, మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. గాయపడినవారిని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి విషమంగా ఉన్న ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రమాద ఘటనలో ట్రాఫిక్ స్తంభించడంతో అక్కడే ఉన్న పెట్రోల్ బంకులోంచి వాహనాలను దారి మళ్లించారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జేబీ కాలనీలో రూపారెడ్డి అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా రూపారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త హైదరాబాద్‌లో ఉండగా.. భార్యకు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన భర్త.. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి పరిశీలించి.. ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రూపారెడ్డిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.హత్యకు గల కారణాలు ఏంటి..? ఘటన వెనుక ఎవరు ఉన్నారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ ఇటీవలే నిజామాబాద్ రూరల్ ఈఈఆర్‌ఓ సెక్షన్లో విధుల్లో చేరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో అంచనాలకు మించి ఖర్చులు పెరగడం.. అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అప్పుల్లో కొంత భాగాన్ని తీర్చేందుకు ఇంటిని విక్రయించినప్పటికీ.. మరికొన్ని అప్పులు మిగిలిపోయాయి. రుణదాతల ఒత్తిడి పెరగడంతో భార్యాభర్తలు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
నిన్న ఇద్దరు పిల్లలను సరస్వతీనగర్‌లోని నరేష్ సోదరి వద్ద ఉంచి.. భార్యతో కలిసి పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలోని అద్దె ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై మేఘన తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ రాసినట్లు భావిస్తున్న ఓ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడితో తీవ్రంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే తల్లిదండ్రుల మృతితో తొమ్మిదేళ్ల బాలుడు, ఏడేళ్ల చిన్నారి ఒక్కసారిగా తల్లిదండ్రులను కోల్పోయారు. తమ తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారంటూ బంధువులను అడుగుతున్న చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల భవిష్యత్తుపై ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.విద్యుత్ శాఖ ఉద్యోగిగా సహచరులతో ఆప్యాయంగా ఉండే నరేష్ మృతితో సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు.
మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి చోరీకి దొంగ ప్రయత్నించడం కలకలం రేపింది. బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో ఓ డూప్లెక్స్ ఇంట్లోకి చొరబడేందుకు గుర్తుతెలియని దుండగుడు ప్రయత్నించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు దొంగ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.అయితే అదే సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు ఉండటంతో దుండగుడి ప్రయత్నం బెడిసికొట్టింది. తలుపు పగలగొట్టేందుకు దొంగ ప్రయత్నిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే గట్టిగా అరవడంతో దుండగుడు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.కుటుంబసభ్యులు బయటకు వచ్చేలోపే దొంగ గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడేందుకు దొంగలు ప్రయత్నిస్తుండటంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారులో మంటలు కలకలం రేపాయి.. శంకర్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారు మాధవరెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. అయితే కారును ఎవరైనా ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారనే అనుమానాన్ని కారు యజమాని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు ఎలా దగ్ధమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌నగర్‌లోని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు వద్దకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చారా.. కావాలనే నిప్పు పెట్టారా అనే విషయాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసులో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం 3.22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
రాజమహేంద్రవరంలో ఓ మాల్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రియాంక స్కూటీని నిందితులు కారుతో ఢీకొట్టారు. తొలుత ఈ ఘటనను పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా పరిగణించారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక స్కూటీని పలుమార్లు కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరా ఆధారాలతో కేసులో సెక్షన్లను మార్చిన పోలీసులు.. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించారు. ప్రియాంకపై హత్యాయత్నం జరిగినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే వెల్లడించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రియాంకకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సీరియస్‌గా పరిగణించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారించడంతో కేసును మరింత తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక మృతితో ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది.
తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి వైపు వస్తున్న లారీ.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును, అక్కడ ఆగి ఉన్న ఒక కారును బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఒక చిల్లర దుకాణాన్ని కూడా లారీ పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. లారీ డ్రైవర్, క్లీనర్లను అక్కడికక్కడే పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోజికోడ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు బిడాడి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. వర్షంలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి రహదారిపై ఉన్న ఓవర్‌హెడ్ సైన్‌బోర్డు నిర్మాణాన్ని ఢీకొట్టిన అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మిథిలేష్, కండక్టర్ అరుణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.