Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..

శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..

by CVR NEWS

శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్‌ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది మీది హంగులే తప్ప.. లోపల అత్యవసరమైన ఫైర్‌ సేఫ్టీ వసతులు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే వారి పాలిటి యమపాశంగా మారింది. కేవలం లాభార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిమాపక నిబంధనలను తుంగలో తొక్కి, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా వందలాది మంది ప్రాణాలతో అమృత ఆసుపత్రి యాజమాన్యం ఆటలాడుకుంటోంది. ​అమృత హాస్పిటల్‌కు ఎటువంటి ఫైర్ NOC లేదని స్వయంగా జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు ధృవీకరించారు..

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొనే వ్యవస్థగానీ… దానికి అవసరమైన కనీస పరికరాలు గానీ అమృత హాస్పిటల్‌లో లేకపోవడం గమనార్హం. కేవలం పేరుకు కొన్ని సిలిండర్లు, అలారంతో ఆసుపత్రిని నడిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను బయటకు తీసుకెళ్లేందుకు అవసరమైన అడ్జస్ట్ డోర్స్ గానీ, ఇతర రక్షణ మార్గాలు కానీ అక్కడ లేవు…

ఇదే విషయంపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్పందిస్తూ.. జిల్లాలో అనుమతులు ముగిసిపోయిన 15 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అందులో అమృత హాస్పిటల్ కూడా ఒకటి అని తెలిపారు. వెంటనే సిబ్బందిని పంపి తనిఖీలు కూడా జరిపిస్తామని చెప్పారు..

ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా, యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ​ప్రతిరోజూ ఈ ఆసుపత్రికి వందలాది మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. పదుల సంఖ్యలో రోగులు ఇన్‌పేషెంట్లుగా గదుల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి తోడు ఆసుపత్రి పక్కనే ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన ఎమర్జెన్సీ రూమ్ ఉంది. అగ్నిమాపక రక్షణ లేని చోట ఆక్సిజన్ సిలిండర్లు ఉండటం అంటే అది పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంపై కూర్చోవడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అన్ని రకాల అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించే వరకు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: