Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Sports జపాన్ ఓపెన్ టోర్ని విజేత పీవీ సింధు.

జపాన్ ఓపెన్ టోర్ని విజేత పీవీ సింధు.

by CVR NEWS
జపాన్ ఓపెన్ టోర్ని విజేత పీవీ సింధు

ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్ద టైటిల్‌ ఎట్టకేలకు పీవీ సింధు చేతికి చేరింది. ఆతిథ్య దేశం అభిమానుల మధ్య, నాలుగుసార్లు జపాన్‌ ఓపెన్‌ విజేత యమగుచిని ఆమె సొంతగడ్డపైనే ఓడించి భారత స్టార్‌ షట్లర్‌ ఘన విజయం సాధించింది. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడమే కాదు.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

టోక్యో మెట్రోపాలిటన్‌ జిమ్నేషియంలో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-17, 21-17తో యమగుచిపై ఆధిపత్యం చాటింది. తొలి గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడినా.. 17-17 సమయానికి సింధు దూకుడు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అదే మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది.

రెండో గేమ్‌లో సింధు మరింత దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే ఆధిక్యం సాధించి యమగుచిపై ఒత్తిడి పెంచింది. మధ్యలో జపాన్‌ స్టార్‌ పుంజుకుని స్కోరు 18-17కు తీసుకొచ్చినా.. కీలక సమయంలో సింధు ఏమాత్రం తడబడలేదు. వరుస పాయింట్లతో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్వదేశీ అభిమానుల హర్షధ్వానాల మధ్య యమగుచిని నిలువరించడం సింధు విజయానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.

ఈ టైటిల్‌తో సింధు రెండేళ్ల తర్వాత BWF వరల్డ్‌ టూర్‌లో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో 2024 డిసెంబరులో సయ్యద్‌ మోదీ టోర్నీ గెలిచిన తర్వాత ఆమెకు ఇదే తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌. అంతేకాదు.. సూపర్‌-750 లేదంటే అంతకంటే ఉన్నత స్థాయి టోర్నీల్లో ఏడేళ్ల తర్వాత మళ్లీ విజేతగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది.

ఈ టైటిల్‌ సాధించే క్రమంలో సింధు అత్యున్నత స్థాయి ఆటను ప్రదర్శించింది. ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ను ఓడించింది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత చెన్‌ పై అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో యమగుచిని మట్టికరిపించి జపాన్‌ ఓపెన్‌ ట్రోఫీని ముద్దాడింది. ఒకప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించిన సింధు..మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటోందనే సంకేతాలను ఈ టోర్నీ స్పష్టంగా చూపించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: